క్షతగాత్రుడ్ని ఆసుపత్రికి తరలించిన ఇన్‌స్పెక్టర్ పుల్యాల
కాకతీయ, వరంగల్ బ్యూరో : మడికొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని పోలీస్ ట్రైనింగ్ సెంటర్ వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు గాయపడ్డారు. బైక్‌పై ప్రయాణిస్తున్న ఆకుల శశాంక్, సాయిరాం డివైడర్‌ను ఢీకొట్టి బైక్‌తో సహా పడిపోయారు. ఈ ఘటనలో బైక్ నడుపుతున్న శశాంక్ తలకు తీవ్ర గాయం తగిలి అధిక రక్తస్రావం జరిగి, ఎడమ చేయి విరగడంతో అపస్మారక స్థితికి చేరుకున్నాడు. సమాచారం అందుకున్న వెంటనే మడికొండ పోలీస్ ఇన్‌స్పెక్టర్ పుల్యాల కిషన్ తన సిబ్బందితో కలిసి ఘటనాస్థలానికి చేరుకుని తక్షణ చర్యలు చేపట్టారు. శశాంక్ బంధువులకు సమాచారం అందించడం తో పాటు, అంబులెన్స్ ఆలస్యమవుతుండడంతో పోలీస్ వాహనంలోనే బాధితుడిని రోహిణి ఆసుపత్రికి తరలించారు. సకాలంలో స్పందించి ప్రాణాపాయంలో ఉన్న యువకుడిని ఆసుపత్రికి చేర్చిన పోలీసుల సేవాభావంపై ప్రజలు ప్రశంసలు కురిపించారు.


