కాంగ్రెస్ అండదండతోనే ఇసుక మాఫియా
చెక్ డ్యామ్‌లను కూల్చివేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలి
కేసీఆర్ కడితే రేవంత్ రెడ్డి కూలుస్తున్నడు
కాళేశ్వరం ప్రాజెక్టుపైనా అనుమానాలు
టెర్రరిస్టులను మించిపోతున్న ఇసుక మాఫియా
మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు
కాకతీయ, హుజురాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం అండదండలతో ఇసుక మాఫియా చెలరేగిపోతుందని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు అన్నారు. మంగళవారం తనుగుల చెక్ డ్యామ్ ను సందర్శించి మాట్లాడారు. చెక్‌డ్యామ్‌లను ఇసుక మాఫియా బాంబులతో పేల్చివేసిందని ఆయన ఆరోపించారు. ఇసుక కోసం రైతులను నడిరోడ్డుపై నిలబెట్టారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇసుక మాఫియా తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. చెక్ డ్యామ్ పేల్చివేయడంతో సుమారు 20వేల ఎకరాలు సాగుకు నోచుకోకుండా అయిందని, సుమారు రూ.24 కోట్లు పెట్టి కట్టిన చెక్ డ్యామ్పేల్చివేశారని, వెంటనే నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. వారిని అదుపులోకి తీసుకొని రూ. 24 కోట్లు వసూలు చేయడంతో పాటు శిక్షించాలని ఆయన అన్నారు. కేసీఆర్ హయాంలో కాళేశ్వరం లాంటి గొప్ప ప్రాజెక్టును కట్టి లక్షల ఎకరాలకు నీళ్లు అందించారని, కాంగ్రెస్ పాలనలో కూల్చడం మొదలు పెట్టారని ఎద్దేవా చేశారు. ఇసుక మాఫియా టెర్రరిస్టులను మించిపోయిందన్నారు. ప్రభుత్వం ఇప్పటివరకు కూల్చిన వారిని గుర్తించకపోవడం సిగ్గుచేటన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో రెండు పిల్లర్లు కుంగినా ఇప్పటివరకు మరమ్మతు చేయించడం లేదని అన్నారు. వెంటనే ఈ ప్రాంతంలో కాపర్ డ్యాం నిర్మాణం చేసి సుమారు 20వేల ఎకరాలకు నీళ్లు అందించాలని ఉన్నారు. ఆయన వెంట హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ఎమ్మెల్యేలు రవిశంకర్, సంజయ్, మాజీ ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, దాసరి మనోహన్ రెడ్డి ఉన్నారు.



