నారాయణపూర్ నిర్వాసితులకు పూర్తి పరిహారం అందజేస్తాం
ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
కాకతీయ కరీంనగర్ : నారాయణపూర్ నిర్వాసితులకు పూర్తి పరిహారం అందజేస్తామని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. గంగాధర రైతు వేదికలో రైతు వేదికలో నారాయణపూర్ రిజర్వాయర్ పరిధిలోని మంగపేట గ్రామానికి చెందిన నిర్వాసితులకు మంగళవారం పరిహారం చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేసి మాట్లాడారు.
నారాయణపూర్ రిజర్వాయర్ పనుల్లో 70 శాతం అప్పటి సీఎం వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలోనే పూర్తయినా, అనంతరం అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వాసితుల సమస్యలను పట్టించుకోలేదని, ఒక్క రూపాయి పరిహారం ఇవ్వలేదని విమర్శించారు. రిజర్వాయర్‌లో మట్టి తొలగింపు పనులు కూడా సాగలేదన్నారు. తాను ఎన్నికల సమయంలో నిర్వాసితులకు న్యాయం చేస్తామనే హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తుచేస్తూ ఆ హామీని నిలబెట్టుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి దృష్టికి సమస్యను తీసుకెళ్లి రూ. 23.50 కోట్లు మంజూరు చేయించినట్టు తెలిపారు.నారాయణపూర్ రిజర్వాయర్ పరిధిలోని మంగపేట, నారాయణపూర్, చర్లపల్లి, ఇస్తారిపల్లి గ్రామాల్లో నష్టం జరిగిన ప్రతి కుటుంబానికి పూర్తి స్థాయిలో పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు.


