కాకతీయ, తెలంగాణ బ్యూరో: బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రామచంద్రరావును రాష్ట్ర ప్రభుత్వం హౌజ్ అరెస్ట్ (గృహ నిర్బంధం) చేయడంపట్ల కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి శ్రీ బండి సంజయ్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బంజారాహిల్స్ పెద్దమ్మ గుడివద్ద హిందూ సంఘాలు నిర్వహించే కుంకుమార్చన కార్యక్రమానికి వెళ్లే ప్రోగ్రాం లేకపోకపోయినా రామచంద్రరావును అడ్డుకోవడంపైనా మండిపడ్డారు. పార్లమెంట్ సమావేశాల్లో బిజీగా ఉన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ ఈ విషయం తెలిసిన వెంటనే తీవ్రంగా స్పందించారు.
‘అయినా పెద్దమ్మ గుడికి హిందువులు పోతే తప్పేంది? రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందనడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? భాగ్య నగర్ లో హిందూ సంఘాలను, బీజేపీ కార్యకర్తలందరినీ అరెస్ట్ చేయడం మూర్ఖత్వం’’అని పేర్కొన్నారు.
ఒక పథకం ప్రకారమే కాంగ్రెస్ వ్యవహరిస్తున్నట్లు కన్పిస్తోందన్నారు. పెద్దమ్మ గుడిని కూల్చిన గూండాలను అరెస్ట్ చేయకుండా శాంతియుతంగా పూజలు నిర్వహించే హిందూ సంఘాల నాయకులను, కార్యకర్తలను అరెస్ట్ చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. జూబ్లిహిల్స్ ఉప ఎన్నికల్లో ఒక వర్గం ఓట్ల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్లాంటి కుట్రలు చేస్తోందని మండిపడ్డారు.
ఒక వర్గం ఓట్ల కోసం హిందువుల మనోభావాలతో ఆటలాడుకుంటోందన్నారు. రాష్ట్ర ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ది చెప్పే రోజులు రాబోతున్నాయని అన్నారు.


