ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన
వందలాది మందికి ఉచిత పరీక్షలు నిర్వహించిన నెఫ్రాన్ కిడ్నీ సెంటర్
కాకతీయ, హుజురాబాద్ : నెఫ్రాన్ కిడ్నీ సెంటర్ హనుమకొండ ఆధ్వర్యంలో హుజరాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత (ప్రాథమిక) పాఠశాలల ఆవరణంలో ఆదివారం నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి ప్రజల నుండి విశేష స్పందన లభించింది. హనుమకొండ లోని నెఫ్రాన్ కిడ్నీ సెంటర్, నిర్మల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో యూరాలజిస్ట్, గోల్డ్ మెడల్ గ్రహీత డాక్టర్ రాఘవేంద్ర ప్రదీప్ సమక్షంలో ఏర్పాటుచేసిన ఈ వైద్య శిబిరానికి పలు రకాల వైద్య నిపుణులు హాజరై అక్కడికి వచ్చిన ప్రజలను ఆరోగ్యశ్రీలో భాగంగా అన్ని రకాల పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. నిర్మల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది కిడ్నీ ప్రోస్టేట్, మరియు అన్ని రకముల కిడ్నీ సంబంధ, మూత్ర సంబంధించిన అన్ని రకాల పరీక్షలను నిర్వహించారు. ప్రజలు మారుతున్న కాలానుగుణంగా ఆహార అలవాట్లలో జాగ్రత్తలు తీసుకోవాలని చిన్నపాటి నిర్లక్ష్యంతోనే జబ్బుల బారిన పడుతున్నారని యూరాలజిస్ట్ గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ రాఘవేంద్ర ప్రదీప్ పేర్కొన్నారు. ఉచిత వైద్య శిబిరాలను స్థానిక ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, అలాంటి అవకాశాన్ని నిర్లక్ష్యం చేయరాదన్నారు. హుజరాబాద్ లో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి ప్రజల నుండి చక్కని స్పందన లభించిందని వందకు పైగా మంది హాజరై వైద్య పరీక్షలు చేయించుకున్నారని ఆయన తెలిపారు. ఎవరికైనా మూత్రపిండాలకు సంబంధించిన సమస్య ఉన్న ఎలాంటి జబ్బు ఉన్న తమ నెఫ్రాన్ కిడ్నీ సెంటర్ ను, నిర్మల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను సందర్శించి ఆరోగ్యశ్రీలో ఉచిత వైద్యం పొందవచ్చునని డాక్టర్ రాఘవేంద్ర ప్రదీప్ సూచించారు. ఈ కార్యక్రమంలో ఆయా ఆసుపత్రుల వైద్యులు, ఇతర వైద్య సిబ్బంది పాల్గొన్నారు.


