మనుషుల్లో దేవుడు సత్య సాయిబాబా
తన సేవలతో దైవంగా కీర్తించబడుతున్నారు
ప్రభుత్వాలతో పోటీ పడి ఉచితంగా విద్య, వైద్యం అందించారు
ప్రపంచవ్యాప్తంగా 140 దేశాల్లో బాబా ట్రస్ట్ సేవలు
తెలంగాణలోనూ అధికారికంగా ఉత్సవాలు నిర్వహిస్తాం..
భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శత జయంతి వేడుకల్లో సీఎం రేవంత్‌రెడ్డి
కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలోనూ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో భగవాన్ శ్రీసత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించాలని ఆదేశించామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. భగవాన్ సత్యసాయి బాబా శతజయంతి కార్యక్రమంలో పాల్గొనడం గొప్ప గౌరవం.. అరుదైన అవకాశం అన్నారు. ఆయన మన మధ్య లేకపోయినా వారి స్ఫూర్తి మనందరిలో ఉంది.. మీ అందరిలో కనిపిస్తోంది అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బాబా సేవలను విస్తృతం చేసేందుకు ప్రభుత్వ సహకారం ఎప్పుడూ ఉంటుందని రేవంత్ రెడ్డి వెల్లడించారు. సత్యసాయి జిల్లా భగవాన్ శ్రీ సత్యసాయి శత జయంతి వేడుకలకు సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఏపీ మంత్రులతోపాటు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. తొలుత భగవాన్ శ్రీసత్యసాయి మహా సమాధిని దర్శించుకుని నివాళులు అర్పించారు. అనంతరం వేడుకలకు హాజరై సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు. ఈ సందర్భంగా సత్యసాయి బాబా ప్రవచనాలైన సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింసా థీమ్‌లతో చిన్నారుల నాట్యం అందర్నీ ఆకట్టుకుంది. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా మనుషుల్లో దేవుడిని చూశారు… ప్రేమతో మనుషులను గెలిచాడు అని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు.
ఆయన స్ఫూర్తి మనందరిలో ఉంది
భగవాన్ శ్రీసత్యసాయి బాబా శతజయంతి సందర్భంగా అందరికీ సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ శతజయంతి వేడుకల్లో పాల్గొనడం ఒక గొప్ప గౌరవం… అరుదైన అవకాశంగా అభివర్ణించారు. శ్రీ సత్యబాబా మనుషుల్లో దేవుడిని చూశారు.. ప్రేమతో మనుషులను గెలిచాడు.తన సేవలతో దేవుడిగా పూజించబడుతున్నారు. ప్రేమతో ఏదైనా సాధించవచ్చని శ్రీ సత్యసాయిబాబా నిరూపించారు అని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. శ్రీ సత్యసాయిబాబా మన మధ్య లేకపోయినా వారి స్ఫూర్తి మనందరిలో ఉంది.. మీ అందరిలో కనిపిస్తోంది. బాబా ప్రభుత్వాలతో పోటీ పడి కేజీ నుంచి పీజీ వరకూ పేదలకు ఉచితంగా విద్యనందించారు. పేదలకు ఉచిత వైద్యం అందించి దేవుడిగా కొలువబడుతున్నారు. గతంలో పాలమూరు జిల్లాలో బాబా ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రజలకు తాగునీటి కష్టాల నుంచి విముక్తి చేసి వారి దాహార్తిని తీర్చారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోనే కాదు తమిళనాడు, కర్ణాటకతో పాటు ప్రపంచ వ్యాప్తంగా బాబా ట్రస్ట్ సేవలు కొనసాగుతున్నాయని సీఎం రేవంత్ రెడ్డి అభివర్ణించారు.
మానవ సేవే మాధవ సేవ
మానవ సేవే మాధవ సేవ అని నమ్మి విద్య, వైద్యంతోపాటు ప్రజలకు మంచినీటి కష్టాలను దూరం చేసి వారి దాహార్తిని తీర్చారు. ప్రపంచంలో కోట్లాది మంది జీవితాలలో బాబా స్ఫూర్తి నింపారు. ప్రపంచవ్యాప్తంగా 140 దేశాల్లో బాబా ట్రస్ట్ సేవలు కొనసాగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో పాల్గొనడానికి ప్రపంచ నలుమూలల నుంచి ప్రముఖులు రావడం ఈ నేల పవిత్రతను తెలియజేస్తోంది. బాబా సేవలను మరింత విస్తృతం చేయాల్సిన అవసరం ఉంది. తెలంగాణలోనూ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించాలని ఆదేశించాం…అని రేవంత్‌రెడ్డి అన్నారు.



