పోదెం వీరయ్యకు షాక్
మొండిచేయి చూపిన కాంగ్రెస్ హైకమాండ్
డీసీసీ పదవిపై ఆశలు గల్లంతు
మండిపడుతున్న అనుచరులు.. అభిమానులు
జిల్లాలో పార్టీకి పెద్ద దిక్కుగా మాజీ ఎమ్మెల్యే
కూర్చున్న కొమ్మను నరుక్కుంటున్నారని ఆగ్రహం
పార్టీని వీడాలంటూ పోస్టులు
కాకతీయ, తెలంగాణ బ్యూరో : భద్రాచలం మాజీ ఎమ్మెల్యే పోదెం వీరయ్యకు కాంగ్రెస్ హైకమాండ్ షాక్ ఇచ్చింది. డీసీసీ పీఠంపై ఆయన పెట్టుకున్న ఆశలు గల్లంతు చేసింది. కూర్చున్న కొమ్మను తానే నరుక్కున విధంగా భద్రాద్రి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి తయారైందన్న వాదన పార్టీ శ్రేణుల నుంచి వినిపిస్తోంది. పదేండ్లు బీఆర్ఎస్ హవా సాగుతున్న సమయంలోనూ వీరయ్య అనేక కష్టనష్టాల కోర్చి కాంగ్రెస్ శ్రేణులను అందరినీ ఒక తాటిపై నడిపి జిల్లా పార్టీకి ఆశాదీపమై వెలిగారు. తాను ఆర్థికంగా అనేక ఇబ్బందులకు గురవుతున్నా అధికార బీఆర్ ఎస్ పార్టీ అనేక రకాలుగా మభ్యపెట్టి ఆశలు చూపించినా తను నమ్ముకున్న సిద్ధాంతం కోసం, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నాయకత్వంలో బలమైన, కరుడుగట్టిన కాంగ్రెస్ సైనికునిగా కొనసాగుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి వీర విధేయుడుగా, భద్రాచలం ఎమ్మెల్యేగా గెలిచినా, ఓటమి పాలైనా జిల్లాలో జిల్లాలో నలుగురు ఎమ్మెల్యేల విజయంలోనూ కీలకంగా పనిచేశారు. కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా భద్రాద్రి జిల్లాను నిలబెట్టడం ఆయనకే చెల్లింది. ఇన్ని రకాలుగా కష్టపడి కాంగ్రెస్ పార్టీని జిల్లాలో తిరుగులేని శక్తిగా ఎదిగేందుకు అహర్నిశలు కృషి చేసిన పొదెం వీరయ్యకు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వకుండా తాను కూర్చున్న కొమ్మను తానే నరుకుకున్న చందంగా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏర్పడింది. అనేక అవమానాలను ఎదుర్కొంటూ కాంగ్రెస్ పార్టీలో కొనసాగడం కంటే భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకొని ముందుకుసాగడం మేలని వీరయ్య అనుచరులు భావిస్తున్నట్లు సమాచారం.
అనాలోచితమైన నిర్ణయాలతో కాంగ్రెస్ పార్టీ పతనం..!
అనాలోచితమైన నిర్ణయాలు కాంగ్రెస్ పార్టీ పతనానికి కారణమవుతున్నాయని వీరయ్య అనుచరులు మండిపడుతున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కొంతమంది కాంగ్రెస్ నాయకుల మధ్య సఖ్యత లేకపోవడం, వర్గ పోరుతో సతమతమవడం పార్టీ చిన్నాభిన్నానికి కారణమవుతోందన్న ఆరోపణలు వస్తున్నాయి. ఏది ఏమైనప్పటికి తనను నమ్ముకున్న వ్యక్తుల కోసం, భద్రాద్రి జిల్లా, భద్రాచలం నియోజకవర్గ అభివృద్ధి కోసం పోదె వీరయ్య కాంగ్రెస్‌పై తిరుగుబావుటా ఎగరేయాలని శ్రేణులు కోరుతున్నాయి. సరైన నిర్ణయంత తీసుకొని కారులో షికారు చేస్తే తనకు, తనను నమ్ముకున్న కార్యకర్తలకు, ఈ ప్రాంత అభివృద్ధికి బాటలు వేసిన వారవుతారని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పొదెం వీరయ్య నిర్ణయం కోసం ఆయన అభిమానులు ఎదురుచూస్తున్నారు. మునిగిపోయే నావలో ఉంటారో, ముందుగానే మేల్కొని తన వారిని కాపాడుకుంటారో ఆలోచించుకోవాల్సిన సమయం వచ్చిందని పోస్టులు పెడుతున్నారు.


