శ్రీ అయ్యప్ప నామస్మరణతో మార్మోగిన మహాత్మా నగర్
విద్యారణ్య భారతి స్వామివారి సువర్ణ కరకమలాలతో ఘనంగా యంత్ర–ప్రాణ ప్రతిష్ట
కాకతీయ, కరీంనగర్ : తిమ్మాపూర్ మండలంలోని మహాత్మా నగర్ గ్రామం ఆదివారం రోజున భక్తి తరంగాలతో ఊగిసలాడింది. శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయ ప్రతిష్టాపన మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఉదయం నుంచే “స్వామియే శరణం అయ్యప్ప” నినాదాలతో గ్రామం మార్మోగిపోయింది.గత రెండు రోజులుగా వేదమూర్తి బ్రహ్మశ్రీ జక్కి కృష్ణావధాని, గురుస్వామి కావేటి పరమేశ్వర స్వామి మార్గనిర్దేశంలో వేదపండితులు మంత్రోచ్ఛారణలతో హోమ–యజ్ఞాదులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. హరి హర పుత్ర ధర్మ శాస్తా (అయ్యప్ప స్వామి), గణపతి, సుబ్రహ్మణ్య, నాగేంద్ర, పార్వతీదేవి, నవగ్రహ దేవతల విగ్రహాల ప్రతిష్టతో దేవాలయ పునరుద్ధరణ కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ఉదయం 8.30 గంటలకు ప్రారంభమైన స్వస్తివాచనం, పాపితా దేవతా పూజలు, రత్న న్యాస, బీజ న్యాస, దాతున్యాస తదితర కార్యక్రమాల అనంతరం మకరలగ్న శుభముహూర్తంలో 10.20కి శంఖనాదాలు, వేదఘోషలు మధ్య శ్రీ శ్రీ జగద్గురు శంకరాచార్య హంపి విరూపాక్ష విద్యారణ్య పీఠాధిపతులు శ్రీ శ్రీ విద్యారణ్య భారతి స్వామి స్వర్ణ కరకమలములతో యంత్ర ప్రతిష్ట, ప్రాణ ప్రతిష్ట, కళాన్యాస, శాంతి పౌష్టిక, జయాది హోమం, బలి ప్రధానము, పూర్ణాహుతి, మహా కుంభాభిషేకం నిర్వహించారు. అనంతరం స్వామివారి ప్రత్యేక అలంకరణ, మంత్రపుష్పాలు, హారతి సంప్రదాయబద్ధంగా సాగాయి. సాయంత్రం 6 గంటలకు మహా పడిపూజతో కార్యక్రమాలకు ముగింపు పలికారు.ప్రతిష్ట మహోత్సవం సందర్భంగా కరీంనగర్ జిల్లా నలుమూలల నుండి వేలాదిగా తరలివచ్చిన భక్తులతో దేవాలయ ప్రాంగణం కిక్కిరిసి పోయింది. అయ్యప్ప మాలధారులు, కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కలిసి స్వామివారిని దర్శించుకోవడం కోసం పెద్ద ఎత్తున క్యూ లైన్లలో నిలిచారు. భక్తులకు తీర్థప్రసాదాలను స్వయంగా విద్యారణ్య భారతి స్వామి అందించి ఆశీస్సులు ప్రసాదించారు.భక్తుల కోసం అలుగునూర్ ఉన్నతి ఫంక్షన్ హాల్ యాజమాన్యం మూడు రోజుల పాటు అన్నప్రసాదాలను విరివిగా పంపిణీ చేసి సేవా కార్యక్రమాల్లో వినియోగించారు. ప్రతిష్ట మహోత్సవం మొత్తం భక్తి, వైభవం, ఆధ్యాత్మికత కలబోసిన పండుగ వాతావరణంలో సాగింది.



