మానేరు చెక్‌డ్యామ్ ధ్వంసం
రైతుల్లో ఆందోళన
మూడు కోట్ల నష్టం
పోలీసులు విచారణలోకి
పలు పార్టీ నాయకుల సందర్శనలు.
కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ జిల్లా జమ్మికుంట శ్రీరాంపూర్ మండలం తనుగుల శివారులో మానేరు వాగుపై నిర్మించిన చెక్‌డ్యామ్ అనుమానాస్పదంగా ధ్వంసమై ప్రాంతంలో కలకలం రేగింది. నవంబర్ 21 రాత్రి చోటుచేసుకున్న ఈ ఘటనపై ఇరిగేషన్ శాఖ ఏఈ పాలకుర్తి రవి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు అయింది. దాదాపు 90 మీటర్ల మేర కూలిన ఈ చెక్‌డ్యామ్ వల్ల సుమారు వెయ్యి ఎకరాల సాగుకు అంతరాయం ఏర్పడే ప్రమాదం ఉందని అధికారులు తెలిపారు. మొత్తం నష్టం మూడు కోట్లకు చేరుకున్నట్లు అంచనా.చెక్‌డ్యామ్ ధ్వంసం విషయం వెలుగులోకి రావడంతో స్థానిక రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బాంబ్ స్క్వాడ్, ఇరిగేషన్ శాఖ అధికారులు, పోలీసులు స్థలాన్ని పరిశీలించి ధ్వంసం విధానంపై క్లారిటీ కోసం విచారణ కొనసాగిస్తున్నారు.
దాసరి మనోహర్ రెడ్డి పరిశీలన
“ ఇది ఇసుక మాఫియా పనే”
ఓదెల మండలం గుంపుల గ్రామ పరిధిలో కూలిపోయిన చెక్‌డ్యామ్‌ను మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి సందర్శించారు. కేసీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మానేరు నదిపై మొత్తం 23 చెక్‌డ్యాంలు నిర్మించిందని, వాటిలో గుంపుల,శంభునిపల్లి చెక్‌డ్యామ్ వేలాది మంది రైతులకు వరమైందని గుర్తుచేశారు. ఈ స్థాయిలో డ్యామ్ కూలిపోవడం యాదృచ్ఛికం కాదని, ఇసుక మాఫియా స్వార్థ ప్రయోజనాల కోసం ఉద్దేశపూర్వకంగా నాశనం చేసినట్లు కనిపిస్తోందని ఆయన మండిపడ్డారు. బాధ్యులను గుర్తించి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వెంటనే డ్యామ్ పునర్‌నిర్మాణానికి చర్యలు చేపట్టాలని ఆయన అధికారులను కోరారు. మాజీ సర్పంచ్ సంపత్, ఎల్లస్వామి, యూత్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ గౌడ్ తదితరులు ఆయనతో పాటు ఉన్నారు.
“ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తే ఉపేక్ష లేదు” – వొడితల ప్రణవ్
శంభునిపల్లి–గుంపుల చెక్‌డ్యామ్‌ను పరిశీలించిన హుజూరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి వొడితల ప్రణవ్ ఘటనపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ ప్రాంత రైతులకు అత్యంత ఉపయోగకరమైన చెక్‌డ్యామ్ ఇలా ధ్వంసం కావడం తీవ్ర నిర్లక్ష్యమో లేక దురుద్దేశమో అని ప్రశ్నించారు. పూర్తి స్థాయి నివేదిక రాగానే బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని తెలిపారు.ఈ విషయమై ఇప్పటికే నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు వెల్లడించారు. వెంటనే మరమ్మత్తుల కోసం నిధులు కేటాయిస్తామని మంత్రి హామీ ఇచ్చినట్లు తెలియజేశారు. పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు కూడా త్వరలో ఘటన స్థలాన్ని పరిశీలిస్తారని చెప్పారు. రానున్న వేసవిలో రైతులకు ఇబ్బందులు రాకుండా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుంటుందని ప్రణవ్ స్పష్టం చేశారు.మొత్తం మీద…చెక్‌డ్యామ్ ధ్వంసం వ్యవహారం రెండు జిల్లాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. రైతులు ఆందోళన చెందుతుండగా, రాజకీయ నాయకులు వరుసగా స్పందిస్తున్నారు. పోలీసులు, ఇరిగేషన్ శాఖ సంయుక్తంగా విచారణను వేగవంతం చేశారు.



