మార్పు..మార్కు..!
వ్యూహాత్మకంగా కాంగ్రెస్ డీసీసీ పదవులకు నియామకం
ఉమ్మడి కరీంనగర్‌లో కాంగ్రెస్ రీ సెట్
కీలక నేతలకే అధ్యక్ష బాధ్యతలు

కాకతీయ, కరీంనగర్ బ్యూరో : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ పెద్ద ఎత్తున మార్పులకు శ్రీకారం చుట్టింది. జిల్లా స్థాయిలో పార్టీని మళ్లీ చైతన్య పరచడానికి కేడర్‌కు ఊపునివ్వడానికి రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) తాజాగా ఐదు కీలక నియామకాలను చేసింది. కరీంనగర్ జిల్లా, కార్పొరేషన్‌తో పాటు జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాలకు కొత్త డీసీసీ అధ్యక్షుల నియామకాన్ని ప్రకటించడంతో పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది.
వ్యూహాత్మకంగా నియామకాలు..!
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ కార్యకలాపాలకు కొత్త ఊపు తీసుకురావడానికి హైకమాండ్ కీలక నిర్ణయాలు తీసుకుంది. జిల్లాల వారీగా ప్రభావం ఉన్న నేతలకు బాధ్యతలు అప్పగిస్తూ కేడర్‌ను మళ్లీ చైతన్యవంతం చేయాలని పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగానే కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా మెడిపల్లి సత్యం నియమించబడ్డారు. ప్రాంతీయంగా చురుకైన నేతగా పేరున్న ఆయన నాయకత్వం జిల్లా స్థాయి కార్యకలాపాలకు బలం చేకూర్చనుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. కరీంనగర్ కార్పొరేషన్ బాధ్యతలు వీ. అంజన్ కుమార్‌కు అప్పగించారు. నగర రాజకీయాలపై అనుభవం కలిగిన అంజన్ నియామకం పట్టణ కాంగ్రెస్‌కు ఉపయోగపడుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అలాగే జగిత్యాల జిల్లాలో గజెంగి నందయ్యకు డీసీసీ బాధ్యతలు అప్పగించారు. కేడర్‌ను సమీకరించడంలో నందయ్య కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని పార్టీ నేతలు పేర్కొంటున్నారు. రాజన్న సిరిసిల్లలో సంగీతం శ్రీనివాస్ బాధ్యతలు స్వీకరించారు. యువతలో ఆయనకు ఉన్న ఆదరణ, స్థానిక పరిభాషలో ఆయన స్థానంతో జిల్లా కాంగ్రెస్‌కు కొత్త ఊపు రావచ్చని అంచనాలు వ్యక్తం అవుతున్నాయి. పెద్దపల్లి జిల్లాలో ఎం.ఎస్. రాజ్ ఠాకూర్‌ను అధ్యక్షుడిగా ఎంపిక చేశారు. జిల్లాలో మండల స్థాయి సమన్వయం బలహీనంగా ఉన్న నేపథ్యంలో రాజ్ ఠాకూర్ నాయకత్వం పార్టీ పునర్‌వ్యవస్థీకరణకు దోహదం చేయనుందని హైకమాండ్ భావిస్తోంది. ఉమ్మడి జిల్లాల్లో కొత్త బాధ్యతలతో ముందుకు వచ్చిన నేతల నియామకాలు గ్రామ, మండల స్థాయిలో కాంగ్రెస్ కార్యకలాపాలకు కొత్త ఊపు తీసుకురావచ్చని పార్టీ వర్గాలు ఆశిస్తున్నాయి.
వేగం పెంచాలనే …
ఉమ్మడి కరీంనగర్ జిల్లా కొత్త అధ్యక్షుల నియామకం ద్వారా కేడర్‌లో కొత్త ఉత్సాహం రేకెత్తించడంతో పాటు గత కొంతకాలంగా నిలిచిపోయిన జిల్లాస్థాయి కార్యకలాపాలకు మళ్లీ వేగం తీసుకురావాలనే పార్టీ లక్ష్యం కనిపిస్తోంది. ఈ మార్పులతో జిల్లా రాజకీయాల్లో కొత్త సమీకరణలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయని నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. స్థానికంగా ప్రభావం ఉన్న నేతలకు బాధ్యతలు అప్పగించడం ద్వారా గ్రామీణ స్థాయి నుండి నగర స్థాయి వరకు పార్టీ నిర్మాణం చురుకుదనాన్ని సంతరించుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.


