ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పైడాకుల అశోక్ నియామకం.
పార్టీ బలోపేతానికి హైకమాండ్ కీలక నిర్ణయం
కాకతీయ, ములుగు ప్రతినిధి: ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మరోసారి పైడాకుల అశోక్‌ను నియమిస్తూ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ శనివారం కీలక నిర్ణయం తీసుకుంది. ములుగు జిల్లాలో పార్టీ శ్రేణులను మరింత బలోపేతం చేయడం, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ దూసుకుపోవడానికి ఈ నిర్ణయం కీలకమైందిగా రాజకీయంగా విశ్లేషిస్తున్నారు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఆమోదంతో పాటు, పార్టీ హైకమాండ్ నుంచి వచ్చిన సూచనల మేరకు ఈ నియామకం జరిగినట్లు సమాచారం. ములుగు జిల్లాలో కాంగ్రెస్ కార్యకలాపాలను వేగవంతం చేయాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో, విస్తృత అనుభవం, కార్యకర్తలతో సత్సంబంధాలు, మౌలిక స్థాయిలో బలమైన నెట్‌వర్క్ ఉన్న అశోక్‌ను ఎంపిక చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ములుగులో కాంగ్రెస్‌కు బలమైన వాతావరణం…
ములుగు నియోజకవర్గంలో మంత్రి సీతక్క పాపులారిటీ, మహిళా సంఘాలతో ప్రభుత్వ కార్యక్రమాలు, గిరిజన ప్రాంతాల్లో పలు అభివృద్ధి పనులు పార్టీకి మంచి బలం చేకూర్చాయి. ఈ నేపథ్యంలో అశోక్ నియామకం జిల్లా కాంగ్రెస్‌కు మరింత ఊతం ఇస్తుందని భావిస్తున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా వ్యూహాత్మక నిర్ణయం…
రాబోయే మండల,జిల్లా పరిషత్, పంచాయతీ రాజ్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపునకు పునాది వేయడమే ఈ నిర్ణయం లక్ష్యం అని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రతి మండలంలో శ్రేణులను చైతన్యపరచడం, గిరిజన ప్రాంతాల్లో పార్టీ హస్తాన్ని మరింత బలోపేతం చేయడం అశోక్ ముందు ఉన్న ముఖ్య బాధ్యతలుగా పరిగణిస్తున్నారు.
నూతన అధ్యక్షునికి పార్టీ శ్రేణుల అభినందనలు…
పైడాకుల అశోక్ నియామకంపై ములుగు జిల్లా లోని కాంగ్రెస్ నాయకులు, మండల అధ్యక్షులు, యువజన కాంగ్రెస్, సేవాదళం, మహిళా కాంగ్రెస్ నాయకులు అభినందనలు తెలిపారు. పార్టీ కార్యకర్తలు ఇది సరిగ్గా సరైన సమయంలో తీసుకున్న నిర్ణయం అని అభిప్రాయపడ్డారు.
పార్టీ బలోపేతం నా మొదటి కర్తవ్యం– పైడాకుల అశోక్.
నూతన నియామకంపై స్పందించిన పైడాకుల అశోక్ పార్టీ హైకమాండ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ కు కృతజ్ఞతలు తెలిపారు. ములుగు జిల్లా కాంగ్రెస్‌ను రాష్ట్రంలోనే అగ్రశ్రేణి జిల్లా విభాగంగా నిలబెట్టేందుకు కృషి చేస్తానని స్పష్టం చేశారు. గ్రామ స్థాయిలో పార్టీ నిర్మాణాన్ని బలోపేతం చేయడం, యువత–మహిళలకు ప్రాధాన్యత ఇవ్వడం, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరేలా పనిచేయడం తన ముఖ్య లక్ష్యాలని అన్నారు.


