స్టేషన్ ఘనపూర్ అభివృద్ధికి శుభారంభం
రూ.10 కోట్ల పనులకు ఎంపీ, ఎమ్మెల్యే శంకుస్థాపన..
కాకతీయ, వరంగల్ బ్యూరో : హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ఉనికిచర్ల గ్రామ శివారులో రూ.10 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న బీటీ రోడ్డు నిర్మాణం, యూనిసిటీ వెంచర్ అభివృద్ధి పనులకు వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి శనివారం శంకుస్థాపన చేశారు. ఎంపీ కావ్య మాట్లాడుతూ.. వరంగల్ నగర అభివృద్ధి కోసం ఇచ్చిన హామీలను అమలు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నగర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టితో భారీ నిధులు కేటాయిస్తున్నారన్నారు. విమానాశ్రయం, కోచ్ ఫ్యాక్టరీ, టెక్స్‌టైల్ పార్క్, స్పోర్ట్స్ స్కూల్, అండర్‌గ్రౌండ్ డ్రైనేజ్ వంటి పలు అభివృద్ధి కార్యక్రమాలకు రూ.4 వేల కోట్లు మంజూరు చేసిన విషయాన్ని గుర్తుచేశారు.
ఎమ్మెల్యే శ్రీహరి మాట్లాడుతూ.. నియోజకవర్గంలో కుడా చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను అభినందించారు. వెంచర్ వరకు నిర్మిస్తున్న నాలుగు లైన్ల బీటీరోడ్డు ఉనికిచర్ల వరకు పొడిగించాలని సూచించారు. ఇదే ప్రాంతంలో బీసీసీఐ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం రానుండటంతో విస్తృత అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. భవిష్యత్తులో ఈ రహదారిని ఉనికిచర్ల, రాపాకపల్లి, దేవునూరు గుట్టల వరకు విస్తరించనున్నట్లు చెప్పారు. దేవునూరు గుట్టలను ఎకో టూరిజం స్పాట్‌గా తీర్చిదిద్దేందుకు ఆక్సిజన్ పార్కులు, ట్రెక్కింగ్ మార్గాలు, రిసార్ట్ వంటి సదుపాయాలను ఏర్పాటు చేయాలని ప్రణాళికలు చేస్తున్నట్లు వెల్లడించారు. పార్టీ మార్పు ఆరోపణలపై వచ్చిన స్పీకర్ నోటీసులకు సంబంధించి శ్రీహరి స్పందిస్తూ, వివరాలు ఇవ్వడానికి మరింత సమయం కోరినట్లు తెలిపారు. స్పీకర్ దీనిపై సానుకూలంగా స్పందించారని చెప్పారు. పదేళ్లలో అధికార పార్టీలో ఉన్నప్పటికీ స్టేషన్ ఘనపూర్ ఆశించినంత అభివృద్ధి చూడలేదని విమర్శించారు. ప్రజల అభివృద్ధి కోసం, హామీల అమలు కోసమే కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నానని స్పష్టం చేశారు. ఉప ఎన్నికలు వచ్చినా పోటీ చేసేది నేనే, ప్రజలు గెలిపించేది కూడా నన్నేనని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కుడా చైర్మన్ ఇనుగాల వెంకట్రాంరెడ్డి, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ చాహత్ బాజ్ పాయ్, కుడా అధికారులు, నాయకులు కార్యక్రమంలో పాల్గొన్నారు.


