ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీలు
కాకతీయ, కరీంనగర్ : బుట్టి రాజారామ్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శనివారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి వెంకటరమణ, పీఓ ఎంహెచ్ఎన్ డాక్టర్ సనా జవేరియా ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా హాజరు రిజిస్టర్, అవుట్ పేషెంట్ రిజిస్టర్ సహా అన్ని విభాగాల రికార్డులను పరిశీలించారు.సిబ్బంది పనితీరును ఏఎన్ఎం వారీగా సమీక్షిస్తూ ఆరోగ్య కార్యక్రమాల అమలు విధానం, రోగులకు అందిస్తున్న సేవల స్థితి, ప్రజా ఆరోగ్య కార్యక్రమాల పురోగతిపై వివరాలు తీసుకున్నారు. ఎన్సీడీ క్లినిక్‌లో నమోదు చేసిన అధిక రక్తపోటు, మధుమేహం రోగుల వివరాలను పరిశీలించి, వారికి మందుల పంపిణీ తీరును తనిఖీ చేశారు.ఫార్మసీ స్టోర్లలో సీజనల్ వ్యాధులకు సంబంధించిన మందుల నిల్వలను పరిశీలించడంతో పాటు టీకాలను భద్రపరిచే ఐఎల్ఆర్ యొక్క టెంపరేచర్ రికార్డులను ధృవీకరించారు. ఐఇసి బోర్డులో ప్రదర్శించిన హైబీపీ, షుగర్ వ్యాధి మందుల నమూనాలను చూసి సిబ్బందికి తగిన సూచనలు అందించారు.మహిళల ఆరోగ్య పరీక్ష శిబిరాల్లో రీ–స్క్రీనింగ్‌ను 100% పూర్తి చేయాలని, రిఫరల్ కేసులను క్రమం తప్పకుండా ఫాలోఅప్ చేస్తూ అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులు ఆదేశించారు.ఈ కార్యక్రమంలో పీఓ ఎంహెచ్ఎన్ సనా జవేరియా, పట్టణ ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి పద్మజ, సూపర్వైజర్ విజయలక్ష్మి, ఇతర వైద్య సిబ్బంది పాల్గొన్నారు.


