కాకతీయ ఎఫెక్ట్..సెల్లార్ దందాపై కమీషనర్ సీరియస్
17 భవనాలకు నోటీసులు
కాకతీయ, కరీంనగర్ బ్యూరో : కరీంనగర్ నగరంలో సెల్లార్ల దుర్వినియోగం పై కరీంనగర్ మున్సిపల్ కమిషనర్ ప్రఫూల్ దేశాయ్ చర్యలు చేపట్టారు. ఈ నెల 20 తేదీ (మంగళవారం) రోజున కాకతీయ దినపత్రికలో ప్రచురితమైన సెల్లార్‌ల్లో వ్యాపారాలు, భవన యజమానుల అత్యాశ శీర్షికపై మున్సిపల్ యంత్రాంగం స్పందించింది.

పౌర సమస్యను ప్రాధాన్యంగా తీసుకున్న కరీంనగర్ మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ శనివారం నగరంలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో పలు కమర్షియల్ భవనాల్లో సెల్లార్‌లు పూర్తిగా వ్యాపారాలకే వినియోగిస్తున్న విషయం వెలుగులోకి రాగా వెంటనే 17 వాణిజ్య భవనాలకు నోటీసులు జారీ చేశారు. సెల్లార్‌ను పార్కింగ్ తప్ప ఇతర అవసరాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధమని వెంటనే క్లియర్ చేయాలని కమిషనర్ ఆదేశించారు.

సెల్లార్‌లు అక్రమ ఆక్రమణలకు మారిపోవడంతో ట్రాఫిక్‌కు ఇబ్బందులు అగ్నిప్రమాదాల సమయంలో ప్రమాదం వంటి ముఖ్య అంశాలను అధికారులు గుర్తించినట్లుగా సమాచారం. ఇటువంటి అక్రమ వినియోగంపై ప్రత్యేక డ్రైవ్ కొనసాగుతుందని మరిన్ని భవనాలపై కూడా తనిఖీలు ఉంటాయని కమిషనర్ స్పష్టం చేశారు.



