ఆజాద్ సరెండర్
నారాయణ, సోమ్‌దా కూడా..
వీరు ముగ్గురూ రాష్ట్ర కమిటీ సభ్యులే
డీజీపీ సమక్షంలో 37 మంది మావోయిస్టుల లొంగుబాటు
ఇందులో 34 మంది ఛత్తీస్‌గఢ్‌కు చెందినవారు
ఇంకా తెలంగాణ నుంచి అజ్ఞాతంలో 59 మంది
కేంద్ర కమిటీలో ఐదుగురు కీలక బాధ్యతలు
సీసీలో మిగిలింది గణపతి, తిరుపతి, రాజిరెడ్డి, హనుమంతు, చొక్కారావు
వివరాలు వెల్లడించిన డీజీపీ శివధర్ రెడ్డి
కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో మొత్తం 37 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిలో ముగ్గురు రాష్ట్ర కమిటీ సభ్యులు కొయ్యడ సాంబయ్య అలియాస్ ఆజాద్, నారాయణ అలియాస్ రమేశ్, సోమ్‌దా అలియాస్ ఎర్ర ఉన్నారని డీజీపీ వెల్లడించారు. మిగిలిన 34 మంది మావోయిస్టులు ఛత్తీస్‌గఢ్‌కు చెందినవారని తెలిపారు. డీజీపీ వివరాల ప్రకారం … లొంగిపోయిన వారిలో ముగ్గురు డివిజనల్ కమిటీ సభ్యులు, 9 మంది ప్రాంతీయ కమిటీ సభ్యులు, 22 మంది దళ సభ్యులుగా ఉన్నారు. వీరంతా తమ వద్ద ఉన్న ఆయుధాలను పోలీసులకు అప్పగించారు.

పునరావాస ప్యాకేజీ ఇస్తాం..
డీజీపీ మాట్లాడుతూ …. అక్టోబర్ 21న పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి పిలుపునకు స్పందించి మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలవడానికి ముందుకొచ్చారని చెప్పారు. ఆజాద్‌పై రూ.20 లక్షలు, నారాయణపై రూ.20 లక్షల రివార్డు ఉండగా, మొత్తం లొంగిపోయిన మావోయిస్టులందరిపై కలిపి రూ.1.41 కోట్లు రివార్డు ఉందని తెలిపారు. ఆ మొత్తాన్ని వారికే అందజేయనున్నట్టు చెప్పారు. తెలంగాణకు చెందినవారికి పునరావాస ప్యాకేజీ కూడా ప్రభుత్వం అందజేస్తుందని తెలిపారు.

త్వరగా లొంగిపోవాలి
అలాగే తెలంగాణకు చెందిన మరో 59 మంది మావోయిస్టులు ఇంకా అజ్ఞాతంలో ఉన్నారని డీజీపీ వెల్లడించారు. వారిలో ఐదుగురు కేంద్ర కమిటీ సభ్యులు ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి, మల్ల రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్, తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీ, పాక హనుమంతు అలియాస్ గణేశ్, బడె చొక్కారావు అలియాస్ దామోదర్ ఉన్నారని చెప్పారు. ఇంకా అండర్‌గ్రౌండ్‌లో ఉన్న మావోయిస్టులు కూడా త్వరితంగా లొంగిపోవాలని డీజీపీ శివధర్‌రెడ్డి కోరారు.



