*డీజీపీ ఎదుట ఆజాద్ లొంగుబాటు*
*ఆయనతో పాటు మరో 36మంది మావోయిస్టు నేతలు*
*మరి కొద్దిసేపట్లో డీజీపీ ప్రెస్‌మీట్ నిర్వహించే అవకాశం*
కాకతీయ, తెలంగాణ బ్యూరో : మావోయిస్టు పార్టీ కీలక నేత ఆజాద్ అలియాస్ కొయ్యడ సాంబయ్య తెలంగాణ డీజీపీ శివధర్‌రెడ్డి ఎదుట లొంగిపోయినట్లు సమాచారం. ఆయనతో పాటు మరో 36 మంది మావోయిస్టు కేడర్ కూడా లొంగుబాటలో ఉన్నట్లు తెలుస్తోంది. శనివారం మధ్యాహ్నం డీజీపీ శివధర్‌రెడ్డి లొంగుపోయిన మావోయిస్టులను మీడియాకు చూపనున్నట్లు సమాచారం. ఆజాద్ మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా, భద్రాద్రి కొత్తగూడెం-అల్లూరి సీతారామరాజు జిల్లాల డివిజన్ కమిటీ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఆయన స్వస్థలం ములుగు జిల్లాలోని మొద్దులగూడెం గ్రామం. ఆయన 1995 నుండి అజ్ఞాతంలో ఉన్నారు. ఆజాద్ తలపై ప్రభుత్వం రూ. 20 లక్షల రివార్డు ప్రకటించింది. ఆజాద్‌తో పాటు డివిజన్ కమిటీ సభ్యుడు అప్పాసి నారాయణ అలియాస్ రమేశ్, ఎర్రాలు మరియు మరో 30 మందికి పైగా మావోయిస్టులు డీజీపీ ఎదుట లొంగిపోయిన వారిలో ఉన్నట్లు సమాచారం. ఇటీవల మావోయిస్టు అగ్రనేత హిడ్మా ఎన్‌కౌంటర్ మరియు పోలీసుల ఆపరేషన్ల నేపథ్యంలో, పలువురు మావోయిస్టు నేతలు లొంగుబాటుకు మొగ్గు చూపుతున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన శాంతి చర్చల పిలుపు కూడా ఈ నిర్ణయాన్ని ప్రభావితం చేసినట్లు తెలుస్తోంది. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు డీజీపీ శివధర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించి.. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించనున్నారు. జనజీవనస్రవంతిలో కలిసేందుకు వచ్చిన మావోయిస్టులను మీడియా ముందు ప్రవేశ పెట్టనున్నారు


