బావ ఇంటికి బావమరిది కన్నం
కుటుంబాన్ని నమ్మించి నేరం
ఆరు నెలల క్రితం జరిగిన దొంగతనం అసలేమిటి..?
మడికొండ పోలీసుల విచారణలో వెలుగులోకి వచ్చిన దొంగతనం కేసు
అనుమానాస్పదంగా తిరుగుతుండగా పట్టుబట్టి విచారణ
కాకతీయ, హనుమకొండ : హనుమకొండ జిల్లా మడికొండ పోలీసుల చర్యలో కుటుంబ సభ్యుల మధ్య చోటు చేసుకున్న దొంగతనం ఘటన వెలుగులోకి వచ్చింది. వాహన తనిఖీల్లో భాగంగా ఐలవేని సాయి రోహిత్ అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. మొదట చిన్నచిన్న ప్రశ్నలకు తప్పు తప్పుగా సమాధానాలు ఇచ్చిన ఆయన, పోలీసులు కఠినంగా విచారణ జరపడంతో అసలు నిజం బయటపెట్టాడు.
ఆరు నెలల క్రితం జరిగిన దొంగతనం అసలేమిటి..?
విచారణలో ఆరు నెలల క్రితం తన బావ బూతగడ్డ సతీష్ ఇంట్లో దొంగతనం చేసిన విషయం రోహిత్ ఒప్పుకొన్నాడు. కుటుంబ సంబంధాలను నమ్మి ఇంట్లో ఉన్న విలువైన వస్తువులను చూసి ప్రలోభపడి దొంగతనం చేశానని తెలిపాడు. ఆ సమయంలో దొంగతనం వెనుక ఉన్న వ్యక్తి ఎవరో గుర్తించలేక కుటుంబం, పోలీసులు అయోమయంలో పడ్డారు. దొంగతనానికి పాల్పడిన రోహిత్ వద్ద నుంచి పోలీసులు మొత్తం 47.05 గ్రాముల బంగారు ఆభరణాలను,రూ. 4.36 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఈ వివరాలను సీఐ పుల్యాల కిషన్ అధికారికంగా వెల్లడించారు.
కుటుంబాన్ని నమ్మించి నేరం
పరాయి దొంగతనం కాకుండానే, కుటుంబాన్ని నమ్మించి చేసిన దోపిడీ కావడం ఈ సంఘటనలో ప్రధాన అంశం. బావమరిది నమ్మకాన్ని ద్రోహం చేసి ఇల్లు ఖాళీ చేసిన తీరు కుటుంబ సభ్యులను తీవ్రంగా కలచివేసింది. రోహిత్ పై దొంగతనం కేసు నమోదు చేసి, న్యాయపరమైన చర్యల కోసం రిమాండ్ కు తరలించారు. బంగారం యజమానులకు తిరిగి అప్పగించే ప్రక్రియను పోలీసులు చేపట్టారు.


