ఖిలా వరంగల్‌లో దారుణం
ఇంట్లో సామాను ఉన్నప్పుడే ఇల్లు కూల్చివేత
కాకతీయ, ఖిలావరంగల్ : ఖిలావరంగల్‌లో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనం కలిగించింది. 18 సంవత్సరాలుగా ఒకే ఇంటిలో కిరాయికి ఉంటున్న అప్పని కవిత తెలిపిన వివరాల ప్రకారం
ఇంటి ఓనర్ గండ్ల శారద తమను ఇల్లు ఖాళీ చేయాలని ఇటీవల చెప్పడంతో, కవిత 15 రోజుల సమయం ఇవ్వమని వేడుకుంది. అయితే సమయం ఇవ్వకుండా, ఇంట్లో సామాను ఉన్న పరిస్థితిలోనే ఇంటి ఓనర్ బుల్డోజర్‌తో ఇల్లు కూల్చేసిందని కవిత తీవ్రంగా ఆరోపించింది. “కట్టు బట్టలతోనే మమ్మల్ని రోడ్డుపాలు చేశారు. పిల్లలతో కలిసి బయటకు వచ్చి నిలబడ్డాం. మా ఆస్తి, మా జీవితం ఒక్కసారిగా శిథిలమైంది,” అని బాధితురాలు కన్నీరుమున్నీరయ్యింది. ఈ ఘటనపై న్యాయం కోరుతూ, తమకు జరిగిన నష్టానికి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్‌ను కవిత ఆశ్రయించింది. అదే సమయంలో, కవిత మరో ఆరోపణ చేసింది. “ ఖిలావరంగల్‌కు చెందిన కొందరు కాంగ్రెస్ నాయకుల అండతో వేరే ప్రాంతం నుండి మహిళలను తీసుకువచ్చి మా పై దౌర్జన్యం చేసి ఇల్లు ధ్వంసం చేశారు,” అని ఆరోపించింది. పోలీసులు ఫిర్యాదు నమోదు చేసి విచారణ ప్రారంభించినట్లు సమాచారం.


