బల్దియాలో పెచ్చరిల్లుతున్న అవినీతి
కలెక్టర్ ప్రత్యేక అధికారిగా ఉన్నా నిధుల గోల్మాల్…?
స్వచ్ఛ సర్వేక్షన్ నిధులపై విజిలెన్స్ విచారణ చేపట్టాలి
మాజీ డిప్యూటీ మేయర్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గుగ్గిల్లపు రమేశ్
కాకతీయ, కరీంనగర్ : పాలకవర్గం లేని కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో ప్రత్యేక అధికారుల పాలనలోనే అవినీతి పెరిగిపోతోందని మాజీ డిప్యూటీ మేయర్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గుగ్గిల్లపు రమేశ్ తీవ్ర ఆరోపణలు చేశారు. శుక్రవారం మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న స్వచ్ఛ సర్వేక్షన్ కోసం కేటాయించిన 30 లక్షల రూపాయలు బల్దియాలో గోల్మాల్ కావడం అత్యంత దారుణమని మండిపడ్డారు. ప్రత్యేక అధికారిగా కలెక్టర్ ఉన్నా నిధులు పక్కదారి పట్టడం ఏమిటని ప్రశ్నించారు. స్వచ్ఛ సర్వేక్షన్ పేరుతో నగరంలో వాల్పెయింటింగ్స్ వేయకుండా, హోర్డింగ్స్ ఏర్పాటు చేయకుండా, కార్యక్రమాలు నిర్వహించకుండానే కొంతమంది అధికారులు ఉన్నతాధికారులను చేతుల్లో పెట్టుకొని బిల్లు పాస్ చేసినట్టు ఆరోపించారు. ఈ అవినీతి బాగోతం కారణంగానే కరీంనగర్ స్వచ్ఛ సర్వేక్షన్ ర్యాంక్ పడిపోయిందని రమేశ్ విమర్శించారు.నగరంలో స్వచ్ఛ సర్వేక్షన్ ప్రచారం జరగకపోయినా, జరిగినట్టు బిల్లు వేయడం… రూ.30 లక్షలు కార్పొరేషన్‌లో ఎలా ఖర్చైందో శ్వేతపత్రం విడుదల చేయాలి అని డిమాండ్ చేశారు. స్వచ్ఛ సర్వేక్షన్ నిధుల దుర్వినియోగంపై విజిలెన్స్ విచారణను తక్షణం ప్రారంభించాలి అని కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు. అవినీతి చేసిన అధికారులను గుర్తించి సర్వీస్ నుంచి తొలగించాలని కోరారు.అలా చేయకపోతే బీజేపీ నేతృత్వంలో ఆందోళన కార్యక్రమాలు మొదలవుతాయని రమేశ్ హెచ్చరించారు.


