- వర్గీకరణ వెంటనే అమలు చేయాలి
- బీసీ సంఘాల డిమాండ్
కాకతీయ, కరీంనగర్ : బీసీ వర్గీకరణను తక్షణమే అమలు చేసి, బీసీ–ముస్లిం ఉపవర్గాలకు జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని బీసీ సంఘాలు డిమాండ్ చేశాయి. కరీంనగర్‌లో మీడియాతో మాట్లాడిన ఆల్ బీసీ మైనారిటీస్ వెల్ఫేర్ రాష్ట్ర అధ్యక్షుడు శుక్రొద్దీన్ భాష, తెలంగాణ సంచార ముస్లిం తెగల సంఘం స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎండీ షబ్బీర్ ప్రభుత్వాల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ వర్గాల్లో తీవ్రమైన వెనుకబాటుతనం ఉన్న ఉపకులాలు, ముఖ్యంగా ముస్లిం ఉపవర్గాలు తీవ్ర అన్యాయానికి గురవుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. బీసీలకు, ముస్లిం వెనుకబడిన వర్గాలకు నిజమైన న్యాయం జరగాలి. జనాభా ఎంతైతే, రిజర్వేషన్ అంతే… మేమెంతో మాకంత అని నేతలు అన్నారు. బీసీల జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు పెంచకపోతే, ఇతర వర్గాలకు అధికంగా కేటాయింపులు చేస్తున్న విధానాన్ని కొనసాగిస్తే, రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక ఉద్యమం చేయక తప్పదని హెచ్చరించారు.
బీసీలలో అత్యంత వెనుకబడిన వర్గాలైన ఏ,బీ,సీ,డీ, ఈ విభజనను చట్టబద్ధంగా అమలు చేసి, ముస్లిం మైనారిటీలకు కూడా ఉన్నత విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో సరైన వాటా ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. క్రిమిలేయర్ విధానాన్ని పేద బీసీలు, ముస్లిం మైనారిటీలకు తీవ్ర నష్టం కలిగిస్తున్నదని పేర్కొంటూ, దాన్ని రద్దు చేయాల్సిన అవసరాన్ని నేతలు స్పష్టం చేశారు.బీసీ హక్కుల కోసం మా పోరాటం ఆగదు ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు తప్పవు అని వారు హెచ్చరిస్తూ తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎండీ షబ్బీర్, ఎండీ దావుద్, ఉమర్ ఫరూక్, గోరె పాషా, శుక్రొద్దీన్ భాష, అబ్దుర్రహమాన్ తదితరులు పాల్గొన్నారు.


