హైకోర్టు ఆదేశాలతో డీసీఓ ఉత్తర్వులు
నర్సంపేట డివిజన్ లో ఐదు పీఏసీఎస్ లలో చైర్మన్ ల భాద్యతలు
కాకతీయ, నర్సంపేట: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పాలకవర్గాల ఆరు నెలలు కొనసాగిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సంఘంలో పాలకవర్గ సభ్యులుగా ఉంటూ రుణాలు తీసుకుని చెల్లించకుండా కాలయాపన చేశారన్న కారణం, డైరెక్టర్ల సమావేశ హాజరు కారణాలతో వరంగల్ జిల్లా సహకార సంఘం అధికారి నీరజ మూడు నెలల క్రితం ఆగస్టులో నర్సంపేట డివిజన్ లోని ఐదు పీఏసీఎస్ ల పాలకవర్గాలను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రాజకీయ కుట్రలో భాగంగానే పీఏసీఎస్ పాలకవర్గం తమను తొలగించిందంటూ ఛైర్మెన్ లు హైకోర్టును ఆశ్రయించారు. రెండు నెలల విచారణ తర్వాత ప్రభుత్వ ఆదేశాల ప్రకారం పాత పాలకవర్గానికే అవకాశాలివ్వాలంటూ కోర్టు జిల్లా సహకార అధికారికి ఆదేశాలు జారీ చేసింది. దీంతో డీసీఓ నీరజ పాత పాలకవర్గలను తిరిగి పదవుల్లో కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. ఉత్తర్వులు రాగానే నాచినపల్లిలో సుఖినే రాజేశ్వర్ రావు, నల్లబెల్లిలో చెట్టుపల్లి మురళీధర్, ఖానాపూర్ లో గుగులోతు రామస్వామి నాయక్, నెక్కొండలో మారం రాము, చెన్నారావుపేటలో చింతకింది వంశీ ఛైర్మెన్లు గా భాద్యతలను స్వీకరించారు. వీరితో పాటు డైరెక్టర్లు సహకార సంఘ కార్యాలయాల్లో బాధ్యతలు స్వీకరించారు. భాద్యతలు స్వీకరించిన చైర్మన్ లకు మాజీ జడ్పీ వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్, మాజీ ఎంపీపీ కాట్ల కోమల భద్రయ్య, నాయకులు పెండ్యాల రాజు, పల్లాటి కేశవరెడ్డి, గుడిపెల్లి జనార్దన్ రెడ్డిలు శుభాకాంక్షలు తెలిపారు.


