- హిడ్మా ఎన్‌కౌంటర్ బూటకం
- 15న తేదీన ఏపీలో అదుపులోకి..
- ద్రోహి సమాచారంతో క్రూరంగా హత్య
- హిడ్మా, రాజే, శంకర్, ఇతర కామ్రేడ్లకు విప్లవ జోహార్లు
- అమరుల స్ఫూర్తితో ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతాం
- మావోయిస్టు పార్టీ సంచలన ప్రకటన
- 23న దేశవ్యాప్తంగా నిరసన దినం
- అభయ్ పేరుతో ప్రెస్ నోట్ రిలీజ్
కాకతీయ, తెలంగాణ బ్యూరో: మారేడుమిల్లి ఎన్‌కౌంటర్‌పై సీపీఐ మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సంచలన ప్రకటన విడుదల చేసింది. ఇది బూటకపు ఎన్‌కౌంటర్ అని, నిరాయుధులైన తమ నేతలను పోలీసులు పట్టుకొని హత్య చేశారని ఆరోపించింది. అభయ్ పేరుతో శుక్రవారం ప్రెస్ నోట్ విడుదలైంది. కేంద్ర కమిటీ సభ్యుడు మడ్వి హిడ్మా, ఆయన సహచరి రాజే మరికొందరితో కలిసి వైద్య చికిత్స కోసం విజయవాడ వెళ్లారు. అక్కడ చికిత్స పొందుతున్న సమయంలో, కొందరి ద్రోహంవల్ల సమాచారం పోలీసులకు చేరింది. నవంబర్ 15న కేంద్ర హోంశాఖ ఆదేశాలతో ఆంధ్రప్రదేశ్ ఎస్‌ఐబీ పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. లొంగిపోవాలని ఒత్తిడి చేసి, వారు నిరాకరించడంతో క్రూరంగా హత్య చేసి, మారేడుమిల్లి అడవుల్లో ఎన్‌కౌంటర్‌గా చిత్రీకరించారని లేఖలో ఆరోపించారు. రంపచోడవరంలో ఏవోబీ రాష్ట్ర కార్యదర్శి శంకర్‌ను కూడా ఇలాగే హత్య చేశారని పేర్కొన్నారు.
23న దేశవ్యాప్తంగా నిరసన
ఈ బూటకపు ఎన్‌కౌంటర్లను ఖండిస్తూ నవంబర్ 23న దేశవ్యాప్తంగా నిరసన దినం పాటించాలని మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చింది. కార్పొరేట్ శక్తుల ప్రయోజనాల కోసమే బీజేపీ-ఆర్ఎస్ఎస్ ప్రభుత్వం ఈ హత్యలకు పాల్పడుతోందని విమర్శించారు. ప్రాణాలు అర్పించిన హిడ్మా, రాజే, శంకర్, ఇతర కామ్రేడ్లకు విప్లవ జోహార్లు అర్పిస్తూ, వారి స్ఫూర్తితో ఉద్యమాన్ని ముందుకు తీసుకెళతామని శపథం చేస్తున్నట్లు తెలిపారు. మొత్తం మీద, మారేడుమిల్లి ఘటనపై పోలీసుల కథనానికి పూర్తి భిన్నమైన వాదనను మావోయిస్టు పార్టీ తమ లేఖ ద్వారా ముందుంచడం తీవ్ర చర్చనీయమైంది.


