- ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతిఘటించాలి
- 26న మండల కేంద్రాల్లో ప్రదర్శనలు, ధర్నాలను జయప్రదం చేయాలి
- తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఈసంపల్లి బాబు
కాకతీయ, దుగ్గొండి: కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా నవంబర్ 26న దేశవ్యాప్తంగా జరుగు మండల కేంద్రాల్లో ధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఈసంపల్లి బాబు పిలుపునిచ్చారు. శుక్రవారం దుగ్గొండి మండలం గిర్నిబావిలో తెలంగాణ రైతు సంఘం సిఐటియు వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో పుచ్చకాయల కృష్ణారెడ్డి, చెల్పూర్ మొగిలి అధ్యక్షతన జరిగిన కార్మిక కర్షకమండల సదస్సులో ముఖ్య అతిథిగా ఈసంపల్లి బాబు పాల్గొని మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం 12 సంవత్సరాలుగా అవలంబిస్తున్న ప్రజా కార్మిక రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలను పెద్ద ఎత్తున నిర్వహించాలని పిలుపునిచ్చారు. రైతు వ్యతిరేక మూడు చట్టాలను విరమించుకుంటున్నామని రాతపూర్వకంగా రైతు సంఘం నాయకులకు హామీ ఇచ్చినప్పటికీ మాటమీద నిలబడకుండా పరోక్షంగా అదేవిధానాలను అమలు చేస్తుందరన్నారు.
రైతాంగాన్ని దివాళా తీయిస్తూ డాక్టర్ స్వామినాథన్ కమిషన్ సిఫారసుల కనుగుణంగా వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు చట్టం తేకుండా, రైతాంగాన్ని దగా చేస్తున్నదని ఆరోపించారు. కార్మికులు అనేక సంవత్సరాలుగా పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను తుంగలో తొక్కేసి కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్ లను తీసుకొచ్చిందన్నారు. జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని క్రమంగా నీరుగారుస్తూ పనులపై అనేక ఆంక్షలు విధిస్తూ ఉపాధి హామీ చట్టాన్ని నీరుకారుస్తున్నదని విమర్శించారు. 26న జరుగు ప్రదర్శనలు ధర్నాలను పెద్ద ఎత్తున జయప్రదం చేయాలని ప్రజాసంఘాల నాయకులు ప్రజలను అధిక సంఖ్యలో సమీకరించాలని కోరారు. సమావేశంలో సిఐటియు జిల్లా నాయకులు చాగంటి వెంకటయ్య, రైతు సంఘం నాయకులు అక్క పెళ్లి సుధాకర్, కొంగర నరసింహ స్వామి, కోడెం రమేష్, సిఐటియు నాయకులు పుట్టపాక రాజు, కొండ బత్తుల కృష్ణమూర్తి, చిలువేరు నారాయణ, యారా నాగరాజు, కనకమల్లు, పుచ్చకాల మహేందర్ రెడ్డి, గొర్రె సంజీవరెడ్డి, బీరం శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


