ఎల్‌ఎండీ జలాశయంలో చేప పిల్లల విడుదల
అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం
కుల వృత్తుల ప్రోత్సహానికి కట్టుబడి ఉన్నాం
సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి
కాకతీయ, కరీంనగర్ : అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, కుల వృత్తుల పురోభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు.జిల్లా మత్స్యశాఖ ఆధ్వర్యంలో లోయర్ మానేరు డ్యామ్‌లో ఉచితంగా చేప పిల్లల విడుదల కార్యక్రమం శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి హాజరై చేప పిల్లలను జలాశయంలో విడిచారు.తరువాత జరిగిన సమావేశంలో మాట్లాడుతూ, జిల్లాలో మొత్తం రూ.2 కోట్లు 18 లక్షల వ్యయంతో 2 కోట్లు 20 లక్షల చేప పిల్లలను చెరువులు, కుంటలు,జలాశయాల్లో విడుదల చేస్తున్నామని తెలిపారు. 80–100 ఎంఎం సైజులో ఉన్న ఈ చేప పిల్లల వల్ల జిల్లా వ్యాప్తంగా సుమారు 2,500 మంది మత్స్యకారులు ప్రత్యక్షంగా, 1,300 మంది పరోక్షంగా జీవనోపాధి పొందుతారని వివరించారు.ఎల్‌ఎండీ జలాశయంలో 30 లక్షల చేప పిల్లలను విడిచినట్టు పేర్కొన్నారు.ఎన్ని ఆర్థిక ఇబ్బందులు వచ్చినా కుల వృత్తుల అభివృద్ధికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని నరేందర్ రెడ్డి స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో పెండింగ్‌లో ఉన్న మత్స్యకారుల బకాయిలను విడుదల చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. మత్స్యకారుల సొసైటీ కమ్యూనిటీ భవన నిర్మాణానికి నిధులు మంజూరు అయ్యేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.అంతకుముందు ప్రమాదవశాత్తు మరణించిన మత్స్యకార్మికుడి కుటుంబానికి రూ.5 లక్షల బీమా చెక్కును అందజేశారు. జిల్లాలో మొదటిసారిగా ఏర్పాటు చేసిన మహిళా మత్స్యకార్మిక సహకార సంఘానికి రిజిస్ట్రేషన్ పత్రాలను అందజేశారు. కొత్తగా సభ్యత్వం పొందిన వారికి సభ్యత్వ నమోదు పత్రాలను అందజేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా మత్స్య కార్మిక సంఘం చైర్మన్ పిట్టల రవీందర్, ఆర్టీఏ మెంబర్ పడాల రాహుల్, మత్స్యశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ విజయభారతి, మత్స్య కార్మిక సంఘ నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.


