కరీంనగర్ ట్రాఫిక్‌కి కొత్త ‘కానిస్టేబుల్’లు!
నగర ట్రాఫిక్‌పై నజార్ కానిస్టేబుల్ బొమ్మల ‘పహారా’
ఎల్ఎండీ పోలీసుల వినూత్న యత్నం
కాకతీయ, కరీంనగర్: నగరంలో ట్రాఫిక్ శాంతిభద్రతలను మెరుగుపరచే దిశగా ఎల్ఎండీ స్టేషన్ పోలీసులు వినూత్న ప్రయత్నం చేస్తున్నారు. పట్టణంలోని ప్రధాన కూడళ్లలో, ప్రమాదాలకు గురయ్యే యూ-టర్న్ ప్రాంతాల్లో నూతనంగా రూపొందించిన పోలీసు బొమ్మలను ఏర్పాటు చేయనున్నారు.డ్రైవర్లలో అప్రమత్తత పెంచడంతో పాటు ట్రాఫిక్ రూల్స్ పాటించేలా చేయడమే ఈ చర్య వెనుక ఉద్దేశం అని పోలీసులు తెలిపారు. పోలీసు యూనిఫార్మ్‌లో నిజమైన కానిస్టేబుల్‌లా కనిపించేలా ఈ బొమ్మలను ప్రత్యేకంగా డిజైన్ చేశారు. రాత్రివేళల్లో కూడా స్పష్టంగా కనిపించేలా ప్రతిబింబక స్టిక్కర్లు అమర్చారు. దీంతో డ్రైవర్లు నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం తగ్గుతుందని, యాదృచ్ఛిక యూటర్న్‌లు నియంత్రితమవుతాయని అధికారులు భావిస్తున్నారు.పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణను బలోపేతం చేసేందుకు ఇటువంటి చర్యలు కొనసాగుతాయని ఎల్ఎండీ పోలీసులు తెలిపారు.


