వ్యవసాయ రంగానికి సహకార వ్యవస్థ అత్యవసరం
సహకార వారోత్సవాల ముగింపు కార్యక్రమంలో ఎమ్మెల్యే రేవూరి
ఊకల్ సహకార సంఘంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
కాకతీయ, గీసుగొండ: వ్యవసాయ రంగానికి సహకార వ్యవస్థ అత్యంత అవసరమని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు.గురువారం ఊకల్ ఎఫ్‌ఏసీఎస్ సహకార సంఘం ఆవరణలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ సత్య శారదతో కలిసి పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రారంభించారు. అనంతరం జరిగిన 72వ అఖిల భారత సహకార వారోత్సవాల ముగింపు కార్యక్రమంలో పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..సహకార వ్యవస్థ రైతులకు అభివృద్ధి దిశగా దారిచూపే కీలక వేదికగా ఉందని పేర్కొన్నారు. విత్తనాలు, ఎరువులు, ఆధునిక వ్యవసాయ యంత్రాలు, బ్యాంకింగ్ సేవలు వంటి అనేక సౌకర్యాలు సహకార సంఘాల ద్వారా గ్రామీణ రైతులకు చేరుతున్నాయని తెలిపారు. రైతులు ప్రభుత్వం అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకుని సహకార సంఘాలను బలపర్చాలని సూచించారు. ప్రభుత్వం ప్రతి కుటుంబం ఆర్థికంగా అభివృద్ధి చెందాలని లక్ష్యంగా పనిచేస్తోందని చెప్పారు. అలాగే ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే అమ్మాలని, చివరి గింజ వరకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి, జిల్లా సహకార అధికారి నీరజ, జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ, తహసిల్దార్ ఎండి రియాజుద్దీన్,మండల వ్యవసాయ అధికారి పి.హరి ప్రసాద్ బాబు,సహకార సంఘాల నోడల్ అధికారి కీరు నాయక్, ఊకల్ సొసైటీ మేనేజింగ్ డైరెక్టర్ శివ, చైర్మన్ బొమ్మాల రమేష్, వైస్ చైర్మన్ జనార్ధన్, పాలకవర్గ సభ్యులు, సిబ్బంది, మండల కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.


