భారత్ షూటర్‌కు మోదీ మంత్రి పదవి.. అసలెవరీ శ్రేయసి సింగ్?
బీహార్‌లో ఏర్పడ్డ కొత్త ప్రభుత్వం
పదోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన నితీశ్ కుమార్
కేబినెట్‌లో ముగ్గురు మహిళలకి స్థానం
క్రీడా రంగం నుంచి రాజకీయ రంగం వరకు శ్రేయసి సింగ్ ప్రయాణం
కాకతీయ, నేషనల్ డెస్క్ : బీహార్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. జేడీయూ అధినేత నితీశ్ కుమార్ పదోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసి రాష్ట్ర రాజకీయ చరిత్రలో అరుదైన రికార్డు సృష్టించారు. సామ్రాట్ చౌదరి, విజయ్ కుమార్ సిన్హాలు డిప్యూటీ సీఎంలుగా బాధ్యతలు స్వీకరించగా, మొత్తం 26 మంది మంత్రులు కేబినెట్‌లో చేరారు. పాట్నాలోని గాంధీ మైదానంలో జరిగిన ఈ వేడుకకు ప్రధాని నరేంద్ర మోదీతో పాటు జాతీయ, రాష్ట్ర నాయకులు హాజరయ్యారు.
ఈ సారి బీహార్ క్యాబినెట్‌లో ముగ్గురు మహిళలకు స్థానం లభించింది. లేషి సింగ్, రమా నిషాద్‌తో పాటు రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన శ్రేయసి సింగ్ తొలిసారి కేబినెట్‌లో చోటు దక్కించుకున్నారు. క్రీడా రంగంలో అంతర్జాతీయ స్థాయి గుర్తింపు పొందిన ఆమె రాజకీయ రంగంలో కూడా అడుగులు వేయడంతో ఇప్పుడు ఆమె పేరు చర్చనీయాంశంగా మారింది.
1991 ఆగస్టు 29న బీహార్‌లోని గిఢౌర్ గ్రామంలో జన్మించిన శ్రేయసి, ఎదిగింది షూటింగ్ ప్రపంచంలో. ట్రాప్ షూటింగ్‌లో భారత్‌కు ఎన్నో పతకాలు అందించి దేశాన్ని ప్రపంచ వేదికపై నిలిపిన షూటర్‌గా ఆమె సుపరిచితమే. 2014 లో కామన్వెల్త్ క్రీడల్లో సింగిల్స్ డబుల్ ట్రాప్ ఈవెంట్‌లో ఫైనల్‌లో 92 పాయింట్లు సాధించి ఆమె రజత పతకాన్ని గెలుచుకుంది. 2017లో బీహార్‌కు ప్రాతినిధ్యం వహిస్తూ 61వ జాతీయ షూటింగ్ ఛాంపియన్‌షిప్‌లో గోల్డ్ మెడల్ సాధించింది. అంతర్జాతీయ స్థాయిలో చేసిన కృషికి గాను ఆమెకు అర్జున అవార్డు లభించింది.
29 ఏళ్లకే బీజేపీలో అడుగు… తొలి ఎన్నికే సంచలన విజయం
2020లో కేవలం 29 ఏళ్ల వయసులో ఆమె బీజేపీలో చేరి రాజకీయాల పట్ల తన ఆసక్తిని ప్రదర్శించారు. అదే సంవత్సరం జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో జముయ్ నుంచి పోటీ చేసి RJD అభ్యర్థి విజయ్ ప్రకాష్‌ను 41,000కుపైగా మెజారిటీతో ఓడించి అందరినీ ఆశ్చర్యపరిచారు. 2025లో జరిగిన ఎన్నికల్లో కూడా శ్రేయసి జముయ్ నియోజకవర్గం నుంచి 54,498 ఓట్ల భారీ తేడాతో గెలుపొంది మరొకసారి తన రాజకీయ బలాన్ని చాటారు. కేవలం 34 ఏళ్ల వయసులోనే ఆమె బీహార్ ప్రభుత్వంలో క్యాబినెట్ మంత్రిగా ప్రమాణం చేశారు.
అయితే శ్రేయసి రాజకీయాలకు కొత్తేమి కాదు. ఆమె తండ్రి దిగ్విజయ్ సింగ్ కేంద్ర మంత్రిగా పనిచేశారు. తల్లి పుతుల్ కుమారి ఎంపీగా ఉన్నారు. తండ్రి, తాత ఇద్దరూ నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (NRAI)లో కీలక పదవుల్లో పనిచేశారు. కాగా, కామన్వెల్త్ గేమ్స్ పతకాల ప్రకాశం నుంచి బీహార్ రాజకీయ జగత్తులో మంత్రిపదవి వరకు శ్రేయసి సింగ్ ప్రయాణం యువతకు ప్రేరణగా నిలుస్తోంది. క్రీడలో సంపాదించిన క్రమశిక్షణ, ధైర్యం, ఫోకస్ ఇప్పుడు రాజకీయాల్లో ఆమెను ముందుకు నడిపిస్తున్నాయి. భారత్‌కు పతకాలు తెచ్చిన ఈ షూటర్.. ఇప్పుడు బీహార్ అభివృద్ధి లక్ష్యానికి టార్గెట్ సెట్ చేసింది.


