బాలల హక్కుల రక్షణ సమాజం మొత్తం బాధ్యత
కలెక్టర్ పమేలా సత్పతి సందేశం
కాకతీయ, కరీంనగర్: బాలల హక్కుల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. బాలల దినోత్సవ వారోత్సవాల ముగింపు కార్యక్రమం మహిళ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్ ఆడిటోరియంలో జరిగింది.ఈ సందర్భంగా కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ.బాలల సంరక్షణ చట్టాలపై అందరికీ అవగాహన తప్పనిసరిదన్నారు. స్నేహితా కార్యక్రమం ద్వారా పాఠశాలల్లో అవగాహన సమావేశాలు నిర్వహిస్తూ బాలల హక్కులను వివరించుతున్నామన్నారు. చిన్నారులు తమకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా ధైర్యంగా 1098 హెల్ప్ లైన్‌కు సమాచారం ఇవ్వాలని సూచించారు. పాఠశాలల్లో ఏర్పాటు చేసిన ఫిర్యాదు పెట్టెలను కూడా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. బాలలపై వేధింపులకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయి మాట్లాడుతూ. బాల్యవివాహాలను అరికట్టాలన్నారు. ఎక్కడైనా బాల్యవివాహాలపై సమాచారం తెలిసితే తక్షణమే అధికారులకు తెలియజేయాలని విద్యార్థులకు సూచించారు. మత్తు పదార్థాల వినియోగం, అమ్మకాలపై సమాచారం వచ్చినా భయపడకుండా తెలియజేయాలని అన్నారు.తరువాత పిల్లల దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ పాఠశాలలు, చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్లలో నిర్వహించిన వివిధ పోటీల్లో విజేతలకు సర్టిఫికెట్లు అందజేశారు. సైన్ లాంగ్వేజీలో జాతీయ గేయం పాడిన పిల్లలను, రాష్ట్ర,జాతీయ స్థాయిలో క్రీడల్లో రాణించిన విద్యార్థులను సత్కరించారు. పిల్లల దత్తతపై అవగాహన కల్పించే పోస్టర్‌ను ఆవిష్కరించారు.కార్యక్రమంలో సిడబ్ల్యూసీ చైర్‌పర్సన్ ధనలక్ష్మి, జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి, డీఐఓ గంగాధర్, ఎంఈఓ ప్రభాకర్‌రావు తదితరులు పాల్గొన్నారు.


