టీమ్ ఇండియా కొత్త కెప్టెన్ కోసం హంట్..రేసులో ఆ ఇద్దరు!
టీమ్ ఇండియా కెప్టెన్సీ రేస్ హీట్
రేసులో రాహుల్–అక్షర్ టాప్ కాంపెటిటర్స్
సెలెక్టర్ల ముందున్న డబుల్ డైలెమా
కాకతీయ, స్పోర్ట్స్ : దక్షిణాఫ్రికా పర్యటనకు ముందు టీమ్ ఇండియాలో అనూహ్యంగా సారథ్య సంక్షోభం తలెత్తింది. రెగ్యులర్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్, వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఇద్దరూ గాయాలతో ఇబ్బంది పడుతుండటంతో ఈ ఇద్దరి అందుబాటు పై అనుమానాలు మరింత పెరిగాయి. దీంతో త్వరలో ప్రారంభం కానున్న మూడు వన్డేల సిరీస్ కోసం జట్టుకు కొత్త తాత్కాలిక కెప్టెన్ అవసరం బలంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే టీమ్ ఇండియా కొత్త కెప్టెన్ కోసం హంట్ స్టార్ట్ అయినట్లు టాక్ నడుస్తోంది.
కోల్‌కతా టెస్టులో శుభ్‌మన్ గిల్ మెడకు గాయం కావడంతో వన్డే సిరీస్‌కు అతని హాజరుపై భారీ సందేహాలు నెలకొన్నాయి. ఇదే సమయంలో వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కూడా తాజాగా గాయంతో బాధపడుతున్నట్లు సమాచారం. ఈ ఇద్దరూ అందుబాటులో లేకపోతే, లీడర్‌షిప్ లొసుగులు తప్పవని భావిస్తున్న బీసీసీఐ.. జట్టు పగ్గాలు ఎవరి చేతుల్లో పెట్టాలనే అంశంపై లోతుగా పరిశీలిస్తోంది. అయితే కెప్టెన్ రేసులో ఉన్న వారు కేవలం ఇద్దరే. అందులో ఒకరు కేఎల్ రాహుల్ కాగా.. మరొకరు అక్షర్ పటేల్.
కేఎల్ రాహుల్ ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు. అంతేకాదు, జాతీయ జట్టుకు గతంలో పలు ఫార్మాట్లలో నాయకత్వం వహించిన అనుభవం అతనికి ఉంది. ఈ అనుభవం అతడిని రేసులో ముందంజలో ఉంచుతోంది. మరోవైపు అక్షర్ పటేల్ పంజాబ్ కింగ్స్‌కు ఐపీఎల్ సీజన్‌లో సారథిగా వ్యవహరించిన అనుభవం అతడిని మరో బలమైన ఎంపికగా నిలబెట్టింది. జట్టు డైనమిక్స్‌ను అర్థం చేసుకునే సామర్థ్యం, మ్యాచ్ సెన్స్ అతడికి అదనపు మద్దతు ఇస్తున్నాయి.
అనుభవం, నాయకత్వం పరంగా చూస్తే రాహుల్‌కే ఆధిక్యం ఉన్నట్లు కనిపిస్తోంది. కానీ, ఇటీవల అతను చేసిన కెప్టెన్సీ కూడా ఒక భారమే అన్న వ్యాఖ్యలు ఇప్పుడు సెలెక్టర్లలో చిన్న సందేహాన్ని కలిగిస్తోంది. మరోవైపు, యువ ఆటగాడు అక్షర్ పటేల్‌కు అవకాశం ఇచ్చి కొత్త లీడర్‌ను తయారు చేయాలనే ఆలోచన కూడా చర్చలో ఉంది. సిరీస్ ప్రారంభానికి ఇంకొద్దిరోజులు మాత్రమే బాకీ ఉండటంతో, బీసీసీఐ త్వరలోనే కొత్త తాత్కాలిక కెప్టెన్‌ను ప్రకటించవచ్చని సమాచారం.


