అనుమానాస్పదంగా మహిళ మృతి
కాకతీయ, నెల్లికుదురు: అనుమానాస్పదంగా మహిళా మృతి చెందిన ఘటన మండలంలోని రామన్నగూడెంలో జరిగింది. బుధవారం ఎస్సై చిర్ర రమేష్ బాబు తెలిపిన వివరాల ప్రకారం.. కురవి మండలం తిర్లాపురం గ్రామానికి చెందిన కళ్లెపు పద్మ(62) నెల్లికుదురు మండలం రామన్నగూడానికి చెందిన ఆమె కూతురు కొయ్యడి సరిత ఇంటి వద్ద నివసిస్తోంది. సరిత, ఆమె భర్త సుధాకర్ బతుకుతెరువు కోసం హైదరాబాదు వెళ్లగా కొంతకాలంగా పద్మ ఒంటరిగా ఉంటుంది. బుధవారం ఉదయం పద్మ ఇంటిముందు ముగ్గు వేయకపోవడంతో ఇరుగుపొరుగు వెళ్లి చూడగా రక్తపు మడుగులో చనిపోయి ఉంది. దీంతో ఆమె కూతురు సరితకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. వెంటనే హైదరాబాద్ నుంచి సరిత ఆమె భర్త రామన్నగూడెం వచ్చి చూడగా మెడకు, కాళ్లకు గాయాలతో చనిపోయి ఉంది. ఈ మేరకు పద్మను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు చంపి ఉంటారని ఆమె కూతురు సరిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ చేసినట్లు ఎస్సై తెలిపారు.



