హిందుత్వమే నా శ్వాస
నా నోటి నుంచి హిందుత్వ నినాదం ఆగిన రోజు నా శ్వాస ఆగినట్లే
ప్రజాభిప్రాయాన్ని మార్చగలిగే శక్తి హిందుత్వానికి ఉంది
బీజేపీ మూడు సార్లు కేంద్రంలో అధికారంలోకి రావడానికి అదే కారణం
ముస్లింలు బీజేపీకి వ్యతిరేకంగా ఏకతాటిపై ఓటేస్తున్నారు
హిందువులు ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది
కేంద్ర హోం సహాయక శాఖ మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
కాకతీయ, హుజూరాబాద్ : హిందుత్వమే తన శ్వాస అని, తన నోటి నుంచి హిందుత్వ నినాదం ఆగిన రోజు తన శ్వాస ఆగినట్లేనని కేంద్ర హోం సహాయక శాఖ మంత్రి బండి సంజయ్ అన్నారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో కరీంనగర్ పార్లమెంట్ పరిధి పోలింగ్ బూత్ అధ్యక్షులు, పైస్థాయి నేతల సమావేశంలో ఆయన ఉద్ఘాటించారు. తెలంగాణలో ప్రజాభిప్రాయాన్ని మార్చగల శక్తి హిందుత్వానికి ఉందని, బీజేపీ మూడు సార్లు కేంద్రంలో అధికారం సాధించడానికి కూడా అదే ప్రధాన కారణమని చెప్పారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో నాలుగు సీట్లతో ఉన్న బీజేపీని 48 సీట్ల వరకు తీసుకెళ్లింది హిందుత్వం శక్తేనని, కరీంనగర్ లో తాను ఎంపీగా గెలుపొందడానికీ అదే తోడ్పడిందని ఆయన గర్వంగా పేర్కొన్నారు. ముస్లిం, క్రైస్తవ, హిందూ అనే తేడాలు లేకుండా మోదీ ప్రభుత్వం అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తుండగా, ఎన్నికల సమయంలో ఇమామ్‌లు, మౌలానాల పిలుపుతో ముస్లింలు బీజేపీకి వ్యతిరేకంగా ఏకతాటిపై ఓటేయడం ఆత్మపరిశీలనకు గురిచేయాల్సిన విషయం అన్నారు.12 శాతం ముస్లింలు ఒక తీర్పుకి వస్తే, 80 శాతం హిందువులు ఏకం అయితే తప్పేంటి? అని ప్రశ్నించారు. హిందుత్వంపై తన వైఖరి మారదని,దేవాలయాల ధ్వంసం, గోరక్షకులపై దాడులు, పోలీసులపై ముస్లిం తీవ్రవాదుల దాడులు జరుగుతున్నప్పుడు హిందుత్వం గురించి మాట్లాడక తప్పదని స్పష్టం చేశారు. ట్రిపుల్ తలాక్ రద్దు చేసి ముస్లిం మహిళలకు గౌరవం తీసుకొచ్చింది మోదీ ప్రభుత్వం అనే విషయాన్ని గుర్తుచేశారు.
పంచాయతీలపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం
రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని వ్యాఖ్యానించిన ఆయన, రెండు సంవత్సరాల్లో కాంగ్రెస్ ఒక్క పంచాయతీకీ పైసా కూడా ఇవ్వలేదని ఆరోపించారు. గ్రామాల్లో 15వ ఫైనాన్స్ కమిషన్ నిధులు, ఎంపీ లాడ్స్, ఉపాధి హామీ, సడక్ యోజన వంటి అభివృద్ధి కార్యక్రమాలన్నీ కేంద్రం ద్వారానే నడుస్తున్నాయని వివరిస్తూ, సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే పంచాయతీలకు నిధులు రాకపోవడం తప్పదన్నారు. బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తే అవసరమైతే సీఎస్సార్ నిధులైనా తెచ్చి పంచాయతీల అభివృద్ధి కోసం ఖర్చు చేస్తానని హామీ ఇచ్చారు. హుజూరాబాద్, జమ్మికుంట, వేములవాడ ఆసుపత్రులకు సీఎస్‌ఆర్ ద్వారా ఐదు కోట్ల రూపాయల మెడికల్ పరికరాలు అందజేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. హుజూరాబాద్‌లో స్టేడియం నిర్మాణానికి 10 కోట్లు విడుదల చేయనున్నట్లు తెలిపారు. సీఐఆర్ఎఫ్ కింద తెలంగాణకు వచ్చిన 1200 కోట్లలో 500 కోట్లు కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఖర్చు చేసినట్లు వెల్లడించారు. కాంగ్రెస్ రెండేళ్ల పాలన పూర్తయిన సందర్భంలో తెలంగాణ రైజింగ్ ఫెస్టివల్ నిర్వహిస్తుండటం కేవలం ప్రచార ప్రయోజనాల కోసం మాత్రమేనని విమర్శించారు. అభయ హస్తం పేరుతో 420 హామీలు ఇచ్చి ఒక్కటీ అమలు చేయని ప్రభుత్వం ఇప్పుడు ఫెస్టివల్ చేస్తుందా? అని నిలదీశారు. మహిళలకు నెలకు ₹2500, తులం బంగారం, స్కూటీ, రైతులకు 15 వేల రూపాయలు, నిరుద్యోగులకు నెలకు నాలుగు వేల భృతి, పేదలకు ఇళ్లు వంటి అనేక హామీలు అమలుకాలేదని గుర్తుచేశారు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలకు ప్రకటించిన డిక్లరేషన్లు కూడా కాగితాల్లోనే మిగిలిపోయాయని మండిపడ్డారు.
బీఆర్ ఎస్ పాలనలో పంచాయతీలు సంక్షోభంలోకి
బీఆర్ఎస్ పాలనలో పంచాయతీలు తీవ్రమైన సంక్షోభంలోకి నెట్టివేయబడి, అప్పుల పాలై సర్పంచులు, ఉద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడాల్సి వచ్చిందని ఆయన ఆరోపించారు. ఈ సమావేశానికి రాష్ట్ర సంఘటనా మంత్రి చంద్రశేఖర్ తివారీ, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, గంగిడి మనోహర్ రెడ్డి, జిల్లాధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి, రెడ్డబోయిన గోపి తదితరులు హాజరయ్యారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ వైఫల్యాలను ఎండగడుతూ రూపొందించిన కరపత్రం మరియు సంతకాల సేకరణ పత్రాలను నేతలు కలిసి విడుదల చేశారు. 26న ప్రారంభమయ్యే సంతకాల సేకరణ కార్యక్రమంలో ఇంటింటికీ వెళ్లి ప్రజల్లో అవగాహన పెంచాలని బండి సంజయ్ కార్యకర్తలను కోరారు.


