నక్సల్స్ అమాయకులు
వాళ్ల చావులకు అర్భన్ నక్సల్సే కారకులు
ఉద్యమం పేరుతో వారిని రెచ్చగొడుతున్నారు
పోరాటం వారిదైతే.. వీళ్లు పదువులు అనుభవిస్తున్నారు..!
నక్సలైట్ల తల్లిదండ్రులు, భార్య, భర్తల గుండె కోత మీకేం తెలుసు?
ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు అర్బన్ నక్సలైట్లు వ్యతిరేకం కాదా?
మరి అట్లాంటప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో నామినేటెడ్ పదవుల్లో ఎందుకు కొనసాగుతున్నారు?
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయనప్పుడు మీరెందుకు ఉద్యమించడం లేదు?
నక్సలైట్ల తుపాకీని సమర్ధించిన వాళ్లు కూడా నేరస్థులే
అమిత్ షా మాటంటే మాటే….మార్చిలోపు మావోయిజాన్ని పూర్తిగా అంతమొందిస్తాం
హుజూరాబాద్ లో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు
కాకతీయ, హుజురాబాద్ : అడవుల్లో ఉద్యమం పేరుతో పోరాడుతున్న అయాయకులైన నక్సలైట్ల చావులకు సోకాల్డ్.. అర్భన్ నక్సలైట్లే కారణమంటూ కేంద్రం హోం సహాయక శాఖ మంత్రి బండి సంజయ్ అన్నారు. ఉద్యమం పేరుతో వారిని రెచ్చగొడుతూ వాళ్ల చావులకు కారణమవుతున్నారని ధ్వజమెత్తారు. పోరాటం వాళ్లు చేస్తుంటే.. పదవులు మాత్రం అర్బన్ నక్సలైట్లు అనుభవిస్తున్నది నిజం కాదా అంటూ ప్రశ్నించారు. నక్సలైట్లు ఎన్‌కౌంటర్ల చనిపోతే వాళ్ల భార్య, భర్త, తల్లిదండ్రుల గుండె కోత వీళ్లకేం తెలుసంటూ మండిపడ్డారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు సోకాల్డ్, అర్భన్ నక్సలైట్లు ఎందుకు గొంతెంతడం లేదంటూ ప్రశ్నించారు. ఎన్నికల హామీలను విస్మరించిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదంటూ నిలదీశారు. దళిత, గిరిజన, ఆదివాసీ అమాయకులను రెచ్చగొట్టి నక్సలైట్లుగా మార్చిన అర్బన్ నక్సలైట్లే వారి చావులకు కూడా బాధ్యత వహించాల్సిందేనని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మావోయిస్టు ఉద్యమానికి మద్దతుగా మాట్లాడేవారిని ఉద్దేశించి అన్నారు. అమాయక నక్సలైట్లు అడవుల్లో చనిపోతుంటే… అర్బన్ నక్సలైట్లు మాత్రం ఆస్తులు కూడగట్టుకుని ప్రభుత్వ నామినేటెడ్, కమిషన్ పదవుల్లో కొనసాగుతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడటమే తమ సిద్ధాంతమని పదేపదే చెప్పుకునే అర్బన్ నక్సలైట్లు… కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎందుకు పదవుల్లో కొనసాగుతున్నారని ప్రశ్నించారు. బుధవారం కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పోలింగ్ బూత్ అధ్యక్ష, కార్యదర్శులు ఆపైస్థాయి నాయకుల సమావేశంలో పాల్గొనేందుకు హుజురాబాద్‌లో పర్యటించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. అర్బన్ నక్సల్స్ గురించి అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ పై విధంగా స్పందించారు. బండి సంజయ్ మాట్లాడుతూ అధికారంలో ఉన్నా లేకున్నా మావోయిజానికి బీజేపీకి వ్యతిరేకమేనన్న విషయాన్ని స్పష్టం చేశారు.
తుపాకీతో రాజ్యాధికారం అసాధ్యం..!
తుపాకీ గొట్టం ద్వారా రాజ్యాధికారం అసాధ్యం. ప్రజలు హర్షించబోరని చెబుతూ వస్తున్నాం. ఈ రోజు అదే నిజమైంది. కానీ మావోయిస్టుల పేరుతో అమాయకులను బలి తీసుకున్నారు. అమాయక పిల్లలను రెచ్చగొట్టి వాళ్ల ప్రాణాలను బలిగొనడానికి ప్రధాన కారణం అర్బన్ నక్సల్స్ మాత్రమే. ఈరోజు చనిపోయిన కుటుంబాలకు ఏం జవాబు చెబుతారు? పిల్లలు చనిపోతే తల్లిదండ్రుల గుండె ఎంతగా శోకిస్తుందో, భర్త చనిపోతే భార్య, భార్య చనిపోతే భర్త ఎంత దు:ఖానికి గురవుతారో ఈ అర్బన్ నక్సల్స్ కు తెలియదా? నేను అర్బన్ నక్సలైట్ల విషయంలో చెప్పిన మాటకు కట్టుబడి ఉంటా. మీడియా, సోషల్ మీడియా ద్వారా రెచ్చగొడుతున్న అర్బన్ నక్సల్స్ అమాయక మావోయిస్టుల చావుకు మీరే బాధ్యత వహించాలి అంటూ మండిపడ్డారు. ఈ అర్బన్ నక్సల్స్, పౌర హక్కుల సంఘం నాయకులను అడుగుతున్నా… పాలకులు ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేపడితే, ప్రజలకు నష్టం జరిగితే ఉద్యమాలు చేయాలనే సిద్ధాంతం మీది కదా? మరి అట్లాంటప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో నామినేటెడ్ పదవుల్లో, కమిషన్ పోస్టుల్లో ఎట్లా భాగస్వాములు అయ్యారు? అంటూ నిలదీశారు.
కాంగ్రెస్‌ను ఎందుకు ప్రశ్నించరు..
ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ మహిళలకు నెలకు రూ.2500లు ఇస్తామన్నరు. వ్రుద్దులకు రూ.4 వేల పెన్షన్ ఇస్తామన్నారు. ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులకు అనేక హామీలిచ్చారు. ఇచ్చారా? అట్లాంటప్పుడు మీరు చేస్తున్నదేమిటి? అందుకే అర్బన్ నక్సల్స్ పైరవీలు చేస్తూ, ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆస్తులు కూడగట్టుకుంటున్నారని చెప్పిన. అదే మాటకు కట్టుబడి ఉన్నా అంటూ స్పష్టం చేశారు. మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అనేక అభివ్రుద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ఆర్ధిక ప్రగతిలో భారత్ ను 4వ స్థానానికి చేర్చాం. విదేశాధి నేతలే మోదీకి సాష్టాంగ పడుతుంటే మీకు కన్పించదా?
అడవులో అన్నలకు విజ్ఝప్తి చేస్తున్నా…. అర్బన్ నక్సల్స్ మిమ్ముల్ని రెచ్చగొడుతున్నారు. వాళ్లు ఆస్తులు కూడగడుతూ పదవులు అనుభవిస్తున్నారు. వాళ్ల మాటలు నమ్మి మోసపోవద్దని కోరుతున్నానని అన్నారు.
అమిత్ షా మాటంటే మాటే..!
అమిత్ షా ఒక్క మాట ఇస్తే తప్పరు.. వచ్చే మార్చి నాటికి మావోయిజాన్ని పూర్తిగా అంతం చేస్తాం. దయచేసి నక్సలైట్లంతా లొంగిపోవాలి. వారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా సాయం అందిస్తున్నాం. సంతోషంగా జీవించవచ్చు. నక్సలిజాన్ని ఎవరు సమర్ధించినా వాళ్లు కూడా నేరస్తులే. మావోయిస్టులే తుపాకులు వదిలి జన జీవన స్రవంతిలో కలుస్తుంటే… అందుకు భిన్నంగా అర్బన్ నక్సల్స్ తుపాకులు పట్టండి, మావోయిస్టుల్లో చేరండి అంటే ఊరుకుంటామా? అది సమర్ధనీయమా? వారి విజ్ఝతకే వదిలేస్తున్నానని బండి సంజయ్ అన్నారు.


