వైట్‌హౌస్ విందులో మస్క్.. ట్రంప్ తో విభేదాలు ముగిసినట్లేనా?
ఎంఎస్‌బీఎస్ అమెరికా పర్యటన సందర్భంగా ట్రంప్ ప్రత్యేక విందు
వైట్‌హౌస్ విందులో స్పెషల్ ఎట్రాక్షన్‌గా ఎలాన్ మస్క్
మస్క్–ట్రంప్ విభేదాలపై ఊపందుకున్న చర్చలు
కాకతీయ, అంతర్జాతీయం : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరియు టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మధ్య నెలకొన్న విభేదాల గురించి అందరికీ తెలిసిందే. ఒక కీలక బిల్లు అంశంపై ఇద్దరి మధ్య తీవ్ర భేదాభిప్రాయాలు తలెత్తడంతో ఘర్షణలు మొదలయ్యాయి. మస్క్ బహిరంగంగానే ట్రంప్ ప్రభుత్వంపై విమర్శలు చేయడంతో వారిని సన్నిహితుల నుంచి ప్రత్యర్థుల దిశగా తీసుకెళ్లాయి. అనంతరం మస్క్ వైట్‌హౌస్ కార్యక్రమాలకు పూర్తిగా దూరంగా ఉన్నారు.
అయితే తాజాగా ఈ పరిస్థితులు మారినట్టుగా కనిపించాయి. విభేదాల తర్వాత తొలిసారిగా మస్క్ వైట్‌హౌస్ కార్యక్రమానికి హాజరై అందరి దృష్టినీ ఆకర్షించారు. సుమారు ఏడు సంవత్సరాల విరామం అనంతరం సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ (ఎంఎస్‌బీఎస్) అమెరికా పర్యటనకు రావడంతో అధ్యక్షుడు ట్రంప్ వైట్‌హౌస్‌లో ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. ఈ విందు గ్లోబల్ మీడియా దృష్టిని ఆకర్షించిన వేళ… మస్క్ హాజరు మరింత ఆసక్తిని రేకెత్తించింది.
ఆ విందు ఒక రకం స్టార్-స్టడెడ్ ఈవెంట్‌గా మారింది. ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో, ఎన్విడియా సీఈఓ జెన్సెన్ హువాంగ్ కూడా హాజరయ్యారు. గ్లోబల్ స్థాయిలో పాలిటిక్స్, టెక్, స్పోర్ట్స్ రంగాల ప్రముఖులు ఒకేచోట సమావేశం కావడం అరుదైన సందర్భంగా మారింది. అందులోనూ మస్క్ హాజరు పాలిటికల్ వర్గాల్లో కొత్త చర్చలకు దారితీసింది. ట్రంప్ తో మనస్పర్థలు ఏర్పడిన తర్వాత వైట్‌హౌస్ ఈవెంట్‌లో మస్క్ తొలిసారి పాల్గొనడంతో ఇద్దరి మధ్య విభేదాలు ముగిసినట్లేనా? ఇవి మళ్లీ సన్నిహిత సంబంధాలు పునరుద్ధరించే ప్రయత్నాలేనా? అన్న ప్రశ్నలు ఊపందుకున్నాయి. కాగా, అమెరికా పాలసీల్లో టెక్ రంగం కీలక పాత్రలో ఉన్న నేపథ్యంలో, మస్క్–ట్రంప్ సంబంధాలు ఎలా మారుతాయన్నది రాబోయే రోజుల్లో స్పష్టమవుతుంది.


