కాంగ్రెస్ నయవంచన పాలన
ఆరు గ్యారెంటీలు అన్‌గ్యారెంటీలుగా మారాయి
42% బీసీ రిజర్వేషన్ కూడా డ్రామానే
బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి
కాకతీయ,హుజురాబాద్: మాయ మాటలతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ప్రజా పాలన పేరిట సంబరాలు చేసుకోవడం అసలు హాస్యాస్పదమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి మండిపడ్డారు. హుజురాబాద్ పట్టణ బీజేపీ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలు రెండు సంవత్సరాల్లో ఒక్కటి కూడా అమలు కాలేదని, అవన్నీ ‘అన్‌గారెంటీలుగా’ మారిపోయాయన్నారు. రేవంత్ రెడ్డి సర్కార్ మాటల గారడీతోనే పాలన కొనసాగుతోందన్నారు. పథకాలు అన్నీ గాల్లో కలిసిపోయాయని విమర్శించారు. బీసీలకు 42% రిజర్వేషన్ ఎన్నికల నాటకమే బీసీల ఓట్లు దండుకోవడానికే కాంగ్రెస్ 42% రిజర్వేషన్ల డ్రామా ప్రదర్శించిందని గంగాడి ఆరోపించారు. 55 ఏళ్లు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఏనాడైనా బీసీల కోసం పోరాడిందా? నేడు మాత్రం ఎన్నికలు దగ్గరగా రావడంతో కొత్త నాటకాలు వేస్తోంది అని ఎద్దేవా చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ కొత్త డ్రామాలు మొదలుపెట్టిందని మండిపడ్డారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులు సిద్ధం కావాల్సిన అవసరం ఉందని, ఈ నేపథ్యంలో బుధవారం హుజురాబాద్‌లో జరిగే బూత్ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమ్మేళనానికి కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ హాజరవుతారని తెలిపారు.ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మాడ వెంకటరెడ్డి, జిల్లా కార్యదర్శి నరసింహరాజు, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ పుప్పాల రఘు, గుజ్జ శ్రీనివాస్, రాముల కుమార్, తూర్పాటి రాజు, కొలకాని రాజు, సంపెల్లి సంపత్ రావు, బైరెడ్డి రమణారెడ్డి, బత్తిని నరేష్, ర్యాకం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


