జాతరలో ఎలాంటి ఇబ్బందులు ఉండొద్దు
గోలివాడలో సమ్మక్క సారలమ్మ జాతర పనులపై కలెక్టర్ శ్రీ హర్ష సమీక్ష
కాకతీయ, అంతర్గాం : 2026 జనవరిలో నిర్వహించనున్న సమ్మక్క–సారలమ్మ జాతరకు లక్షలాది మంది భక్తులు తరలివచ్చే నేపథ్యంలో, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తుగానే అన్ని ఏర్పాట్లు పూర్తిచేయాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ఆదేశించారు. మంగళవారం ఆయన గోదావరిఖని,అంతర్గాం మండలం గోలివాడలో జరుగుతున్న జాతర ఏర్పాట్లను ప్రత్యక్షంగా పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి రెండేళ్లకు ఒకసారి జరిగే ఈ జాతర ప్రాంతీయంగా అత్యంత విశిష్టమైనదని అన్నారు. భారీగా భక్తులు వచ్చే నేపథ్యంలో అధికారులు పూర్తి సమన్వయంతో పనులను చేపట్టాలని సూచించారు. ముఖ్యంగా గోదావరిఖని వద్ద సింగరేణి ఆధ్వర్యంలో జరుగుతున్న పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో చేపట్టాల్సిన పనులకు టెండర్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసి, డిసెంబర్ చివరి నాటికి మొత్తం పనులు పూర్తి చేయాల్సిందిగా సూచించారు. భక్తుల సౌకర్యాల కోసం గద్దెల వద్ద ఏర్పాట్లు, పార్కింగ్ ప్రదేశాల కేటాయింపు, క్యూలైన్ల వ్యవస్థ, తగిన సంఖ్యలో టాయిలెట్లు, షాపింగ్ స్టాళ్లు వంటి ప్రతిపాదనలు వెంటనే సమర్పించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జాతర కాలంలో పారిశుద్ధ్యం అత్యంత ముఖ్యం కాబట్టి, అదనపు కార్మికులను నియమించి ప్రతిరోజూ శుభ్రపరిచే వ్యవస్థను పటిష్టం చేయాలని అన్నారు. నిరంతరాయ విద్యుత్ దీపాలంకరణ ఉండేలా విద్యుత్ శాఖ చర్యలు తీసుకోవాలని, విద్యుత్ అంతరాయం వచ్చిన వేళ జనరేటర్లు సిద్ధంగా ఉంచాలని కలెక్టర్ సూచించారు. జాతర నిర్వహణలో పోలీసు, రెవెన్యూ, నీటిపారుదల, దేవాదాయ, పంచాయతీరాజ్ తదితర విభాగాలు పరస్పర సమన్వయంతో పని చేస్తేనే భక్తులకు ఇబ్బందులు లేకుండా జాతర విజయవంతమవుతుందన్నారు. ఈ పరిశీలనలో అసిస్టెంట్ కమిషనర్ ఎండోమెంట్స్ సుప్రియ, జిల్లా పంచాయతీ అధికారి వీరబుచ్చయ్య, ఎంపీడీవో, ఎంఈఓ, ఇతర శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.


