నషా ముక్త్ భారత్‌కు ప్రజలే బలం సీపీ అంబర్ కిషోర్ ఝా
మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రతిజ్ఞ చేసిన రామగుండం పోలీసు సిబ్బంది
కాకతీయ, రామగుండం : దేశాన్ని మాదకద్రవ్యాల ముప్పు నుంచి కాపాడేందుకు ప్రజల సహకారం అత్యంత కీలకమని రామగుండం పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు. “నషా ముక్త్ భారత్” లక్ష్యాన్ని సాధించడంలో ప్రతి పౌరుడు భాగస్వామ్యం కావాలని, యువతను మత్తు పదార్థాల బారినపడకుండా కాపాడే బాధ్యత అందరిదేనని సీపీ పిలుపునిచ్చారు.కమీషనరేట్ కార్యాలయంలో పోలీసు అధికారులు, సిబ్బందితో కలిసి మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరాడతామని సీపీ ఝా ప్రతిజ్ఞ చేశారు. డ్రగ్స్ వినియోగం యువత భవిష్యత్తును చీకటిలోకి నెట్టేస్తోందని, కుటుంబాలను కృంగదీస్తోందని, సమాజంలో సమస్యలు పెరిగేందుకు కారణమవుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మత్తు పదార్థాల విక్రయం, సరఫరా, వినియోగం గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు.యువతలో అవగాహన పెంచేందుకు స్కూళ్లు, కాలేజీల్లో ప్రత్యేక చైతన్య కార్యక్రమాలు నిరంతరం నిర్వహిస్తున్నట్లు సీపీ వెల్లడించారు. గంజాయి అక్రమ రవాణా, నిల్వ, సరఫరాపై ప్రత్యేక నిఘా పెట్టి నేరస్థులను పట్టుకుంటున్నామని తెలిపారు. మత్తుకు బానిసలైన వారిని గుర్తించి కౌన్సిలింగ్‌కు హాజరుచేసి, అవసరమైతే రిహాబిలిటేషన్ కేంద్రాలకు పంపే చర్యలు కొనసాగుతున్నాయని వివరించారు.రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో డ్రగ్స్ నిర్మూలన కోసం మరింత కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ స్పష్టం చేశారు. నషా ముక్త్ భారత్ సాధనలో ప్రజలు, ముఖ్యంగా యువత చురుకుగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ శ్రీనివాస్, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ నాగేంద్ర గౌడ్, ఏవో శ్రీనివాస్, ఇన్స్పెక్టర్లు రాజేంద్రప్రసాద్, చంద్రశేఖర్ గౌడ్, బాబురావు, నార్కోటిక్ వింగ్ ఇన్స్పెక్టర్ రాజ్ కుమార్, ఆర్‌ఐలు శ్రీనివాస్, వామనమూర్తి తదితరులు పాల్గొన్నారు.


