డ్రగ్స్ మూలాలను పెకిలించాలి కలెక్టర్ పమేలా సత్పతి
జిల్లా వ్యాప్తంగా విస్తృత తనిఖీలకు ఆదేశాలు
కాకతీయ, కరీంనగర్ : యువత భవిష్యత్తు చెడగొట్టే మత్తు పదార్థాల మూలాలను పూర్తిగా మట్టుబెట్టే దిశగా కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి స్పష్టం చేశారు. మంగళవారం కలెక్టరేట్‌లో పోలీస్, ఎక్సైజ్, వైద్యఆరోగ్య, విద్య, మహిళా,శిశు సంక్షేమ శాఖల అధికారులతో జిల్లాస్థాయి నార్కో కోఆర్డినేషన్ కమిటీ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ. డ్రగ్స్ ప్రమాదాలపై ప్రజల్లో విస్తృత అవగాహన సృష్టించేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. బహిరంగ ప్రదేశాల్లో ప్రచారం పెంచి, విద్యాసంస్థల్లో ‘స్నేహిత’ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు అవగాహన కల్పించాలని అన్నారు. ప్రిస్క్రిప్షన్ లేకుండా మత్తు మందులు, ఇంజక్షన్లు విక్రయించే మెడికల్ షాపులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వైద్య ఆరోగ్యశాఖ అధికారులు మెడికల్ దుకాణాలపై ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు.కరీంనగర్ సీపీ గౌస్ ఆలం మాట్లాడుతూ. మాదక ద్రవ్యాల నిర్మూలనలో భాగంగా పోలీసులు రోజువారీగా గస్తీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు హాస్టళ్లు, ఆర్టీసీ కార్గో కేంద్రాలు, ప్రైవేట్ పార్సిల్ కంపెనీలు, ఆన్లైన్ సంస్థలకు సంబంధించిన గోదాములపై ప్రత్యేక తనిఖీలు జరుగుతున్నాయని వివరించారు. డ్రగ్ డిటెక్షన్ కిట్లు, డాగ్ స్క్వాడ్ సహాయంతో నాఖాబందీలు నిర్వహిస్తున్నామని, డ్రగ్స్ వినియోగం లేదా సరఫరా చేస్తే ఎవరినీ వదలబోమని హెచ్చరించారు.సమావేశంలో అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడేతో పాటు పోలీస్, ఎక్సైజ్, వైద్య, మహిళా శిశు సంక్షేమ శాఖల అధికారులు పాల్గొన్నారు.


