నాగ సుబ్రహ్మణ్యేశ్వరుడికి ప్రత్యేక పూజలు
కాకతీయ, గీసుగొండ: కార్తీక మాస చివరి మంగళవారం పురస్కరించుకొని నాగ సుబ్రహ్మణ్యేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మండలంలోని ఊకల్ శ్రీ వల్లి దేవసేన సమేత నాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో ఆలయ ప్రధానార్చకులు సముద్రాల సుదర్శనాచార్యులు వైదిక మంత్రోచ్ఛారణల మధ్య స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. స్వామివారిని వివిధ పుష్పాలతో అలంకరించారు. ఈ సందర్భంగా సుదర్శనా చార్యులు మాట్లాడుతూ.. స్వామివారిని దర్శించుకొని పూజలు చేసిన భక్తులకు కాలసర్ప దోషాలు, రాహు–కేతు గ్రహ దోషాలు తొలగి కళ్యాణ, సంతాన, ఉద్యోగ, విదేశీ గమన యోగాలు కలుగుతాయని అన్నారు. 26న బుధవారం శ్రీవల్లి, దేవసేన, నాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వార్ల కళ్యాణ మహోత్సవాన్ని ఆలయ ప్రాంగణంలో నిర్వహిస్తామని, భక్తులు పాల్గొనవలసిందిగా కోరారు. కార్యక్రమంలో ఆలయ ఉపార్చకుడు శ్రీహర్ష, ఆలయ కమిటీ చైర్మన్ తిమ్మాపురం రాజేశ్వరరావు, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


