సీసీఐ తుగ్లక్ నిర్ణయాలతో పత్తి రైతులకు ఇబ్బందులు
మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు
కాకతీయ, గీసుగొండ: రాష్ట్రంలో పత్తి రైతులు తీవ్రమైన సంక్షోభంలోకి నెట్టబడుతున్నారని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. వరంగల్ జిల్లా గీసుగొండ మండలం మొగిలిచెర్లలో మహిళా రైతు అచ్చ శోభ పత్తి పంటను పరిశీలించిన అనంతరం హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ..సీసీఐ తుగ్లక్ నిర్ణయాలు రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయని,కొనుగోలు కేంద్రాల్లో అనవసరమైన అడ్డంకులు సృష్టించడం వల్ల పత్తి రైతులు అయోమయంలో ఉన్నారని విమర్శించారు. పత్తిని అమ్ముకునే అవకాశం లేక రైతులు దళారుల దయపై ఆధారపడే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా రైతులు తమ సమస్యలను హరీష్ రావుకి వివరించారు.బిఆర్ఎస్ హయాంలో ఎరువులు, నాణ్యమైన విత్తనాలు, కరెంట్,పంట పెట్టుబడి పూర్తిగా అందుబాటులో ఉండేదని తెలిపారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పరిస్థితులు పూర్తిగా మారిపోయా యని, కరెంట్ లేక,కాలువ నీళ్లు అందక పంటలు నష్టపోయా యని అభిప్రాయ పడ్డారు. కల్తీ విత్తనాల కారణంగా పంటలు దిగుబడి ఇవ్వకపోవడం, పండిన పత్తికి గిట్టుబాటు ధర లేక అప్పుల్లో కూరుకు పోయామని తెలిపారు. అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలను ప్రభుత్వ అధికారులు పరిశీలించడానికే రాలేదని రైతులు బాధపడ్డారు. సీసీఐ రూ.8,100/-కి కొనాల్సిన పత్తిని కొర్రిలుపెట్టి తిరస్కరించ డంతో,చివరకు దళారులకు 4,500/-కు అమ్ముకునే దుస్థితి వచ్చిందని వివరించారు.కాంగ్రెస్ ప్రభుత్వం వాగ్దానం చేసిన ఆరు గ్యారెంటీలు మోస పూరితమని, వాటిని నమ్మినందుకు ఇప్పుడు మూల్యం చెల్లిస్తున్నామని రైతులు వాపోయారు.రైతుల సమస్యలను ప్రభుత్వం అత్యవసరంగా పరిష్కరించాలని, సీసీఐ కొనుగోళ్లపై స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.


