కాకతీయ, తెలంగాణ బ్యూరో : టాలీవుడ్‌లో గత వారం రోజులుగా సాగుతున్న సినీ కార్మికుల సమ్మె చర్చలు విఫలమయ్యాయి. నిర్మాతలు, ఫిలిం ఛాంబర్ తో జరిగిన చర్చల్లో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో సోమవారం నుండి షూటింగ్స్ బంద్ అని ఫిల్మ్ ఫెడరేషన్ ప్రకటించింది. సమ్మె ప్రభావంతో చిరంజీవి.. అనిల్ రావిపూడి కాంబినేషన్ లో రూపొందుతున్న భారీ చిత్రం, అలాగే నందమూరి బాలకృష్ణ.. బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న అఖండ 2 వంటి చిత్రాల షూటింగ్స్ నిలిచిపోవనున్నాయి. దీంతో బడ్జెట్ పెరుగుదల, రిలీజ్ డేట్ వాయిదా సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.
వేతనాల పెంపు డిమాండ్‌తో సమ్మె..
ఫిల్మ్ ఫెడరేషన్ నాయకుల ఆధ్వర్యంలో సినీ కార్మికులు వేతనాల పెంపు కోసం కృష్ణానగర్‌లో వారం రోజులుగా సమ్మె నిర్వహిస్తున్నారు. ఫిలిం ఛాంబర్ కొందరికి మాత్రమే వేతనాలు పెంచుతామని చెప్పడం తప్పు అని ఫెడరేషన్ స్పష్టం చేసింది. మా వేతనాల పెంపును నిర్మాతలు పెద్ద సమస్యగా చూడటం లేదు. వచ్చే ఆదాయంలో వాటాలు అడగడం లేదు, కేవలం వేతనాలు మాత్రమే కోరుతున్నాం. కానీ, అడిగితే కేసులు వేస్తారా..? అని ఫెడరేషన్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దసరా రిలీజ్ లను లక్ష్యంగా పెట్టుకుని మేకర్స్ ప్లాన్ చేసిన చిత్రాలపై ఈ సమ్మె పెద్ద అడ్డంకిగా మారింది.


