బిహార్‌లో ఎన్డీఏదే అధికారం
మళ్లీ నితీశ్ సర్కార్ వైపే ఓటర్లు
మహాకూటమికి 100లోపే సీట్లు..
జన్ సురాజ్ ప్రభావం అంతంత మాత్రమే
మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అంచనా..
కాకతీయ, నేషనల్ డెస్క్ : ఉత్కంఠగా ఎదురుచూస్తున్న బిహార్ ఎగ్జిట్ పోల్స్ వచ్చేశాయి. బిహార్‌లో మరోసారి ఎన్డీఏ కూటమిదే విజయమని మెజారిటీ పోల్స్ అంచనా వేశాయి. నితీశ్ కుమార్ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి 130 నుంచి 150 సీట్లు గెలుచుకుంటుందని సర్వేలు చెబుతున్నాయి. కాగా మహాగఠ్‌బంధన్‌కు వచ్చే సీట్లు 100 సీట్లలోపు ఉండే అవకాశం ఉందని వెల్లడించాయి. ఇక ప్రశాంత్ కిశోర్‌కు చెందిన జన్ సురాజ్ ప్రభావం అంతంత మాత్రమే అని స్పష్టం చేశాయి. ఇతర పార్టీల పరిస్థితి కూడా ఇంచుమించు అదే విధంగా ఉంది.
మళ్లీ అధికార పీఠం ..
మెజారిటీ సర్వేలు ఈసారి కూడా ఎన్డీఏదే అధికారమని చెబుతున్నాయి. ‘పీపుల్ పల్స్’ ఎన్డీఏకు 133-159 సీట్లు, మహాగఠ్‌బంధన్‌కు 75-101 సీట్లు, జేఎస్పీకి 0-5 సీట్లు, ఇతరులకు 2-8 సీట్లు వస్తాయని అంచనా వేసింది. ‘పీపుల్ ఇన్సైట్’ సర్వే ఎన్డీఏకు 133-148 సీట్లు, మహాగఠ్‌బంధన్‌కు 87-102 సీట్లు, జేఎస్పీకి 0-2 సీట్లు, ఇతరులకు 3-6 సీట్లు వస్తాయని పేర్కొంది. ‘మ్యాట్రిజ్’ ఎన్డీఏకు 147-167 సీట్లు, మహాగఠ్‌బంధన్‌కు 70-90 సీట్లు, జేఎస్పీకి 0-2 సీట్లు, ఇతరులకు 3-6 సీట్లు వస్తాయని అంచనా వేసింది. ‘జేవీఎస్ పోల్స్’ అయితే ఎన్డీఏకు ఏకంగా 135-150 సీట్లు వస్తాయని పేర్కొంది. మహాగఠ్‌బంధన్ 88-103 సీట్లతో సరిపెట్టుకుంటుందని అంచనా వేసింది. ఇతరులు 3-6 సీట్లు సాధించవచ్చని తెలిపింది. దైనిక్ భాస్కర్ ప్రకారం, ఈసారి ఎన్డీఏకు 145-160 సీట్లు, మహాగఠ్‌బంధన్‌కు 73-91 సీట్లు వస్తాయని తెలిపింది. ప్రశాంత్ కిశోర్‌కు చెందిన జేఎస్పీ కనీసం ఖాతా కూడా తెరవకపోవచ్చని పేర్కొంది. ఇతరులు 0-3 సీట్లు గెలుచుకుంటారని పేర్కొంది.


