నాగార్జున కుటుంబంలో డిజిటల్ అరెస్టు..
2 రోజులు ఇంట్లోనే నరకం!
అక్కినేని ఇంట్లో డిజిటల్ అరెస్టు కలకలం
రెండు రోజులు నిర్బంధం
హైదరాబాద్ సీపీ సజ్జనార్ తో భేటీ తర్వాత మీడియాతో మాట్లాడిన నాగార్జున
కాకతీయ, సినిమా : ఇటీవలి కాలంలో దేశవ్యాప్తంగా వేగంగా పెరుగుతున్న కొత్త తరహా మోసం.. డిజిటల్ అరెస్టు. రోజురోజుకు డిజిటల్ అరెస్టుకు గురవుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. అయితే ఆ జాబితాలో మేమూ ఉన్నామంటూ సంచలన విషయాన్ని రివీల్ చేశారు అక్కినేని నాగార్జున. తెలంగాణ పోలీసులు ఐబొమ్మ వెబ్‌సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ అరెస్ట్ తో తెలుగు సినీ పరిశ్రమను సంవత్సరాలుగా తీవ్రంగా దెబ్బతీస్తూ వచ్చిన పైరసీ నెట్‌వర్క్ కుప్పకూలింది.
ఈ నేపథ్యంలోనే సోమవారం టాలీవుడ్ నుంచి చిరంజీవి, నాగార్జున, రాజమౌళి, దిల్ రాజు తదితరులు కలిసి సీపీ సజ్జనార్‌ను కలుసుకున్నారు. పైరసీని అరికట్టేందుకు పోలీసు విభాగం చేస్తున్న పోరాటాన్ని వారు అభినందించారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో సీనియర్ నటుడు నాగార్జున చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనియాంశంగా మారాయి. రవి కేసులో వెలుగుచూస్తున్న వివరాలు డిజిటల్ అరెస్టు మోసాలతో కూడా సంబంధం ఉంటాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ అంశంపై నాగార్జునమాట్లాడుతూ.. `మా కుటుంబ సభ్యుల్లోనూ ఒకరు డిజిటల్ అరెస్టు బారిన పడ్డారు. రెండు రోజుల పాటు ఇంట్లోనే నిర్బంధానికి గురై నరకం చూశారు.. పోలీసులకు సమాచారం ఇచ్చేలోపే మోసగాళ్ల జాడ మాయమైంది,” అని వెల్లడించారు. ఇంత పెద్ద సెలబ్రిటీల కుటుంబానికే ఇలా జరిగితే, సాధారణ ప్రజలు ఎంత జాగ్రత్తగా ఉండాలో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
ఇక పైరసీని అరికట్టేందుకు తెలంగాణ పోలీసులు చేస్తున్న కృషి అభినందనీయమని నాగార్జున ప్రశంసించారు. `ఐబొమ్మ రవి అరెస్ట్ తర్వాత చెన్నై నుంచి తన స్నేహితుడు కాల్ చేసి, `మేము చేయలేని పని మీరు చేశారు అని చెప్పడం సంతోషాన్ని ఇచ్చింది. ఐబొమ్మ వంటి పైరసీ వెబ్‌సైట్లు ప్రజలకు ఉచిత సినిమాలు చూపించాలనుకోవడం అనేది వారి మోసానికి తొడుగులాంటిది.. అంతర్జాతీయ ముఠాలు ఈ సైట్ల ద్వారా డేటా సేకరిస్తున్నాయి. ఆ డేటాతో పెద్ద స్థాయిలో మోసం చేస్తున్నారు, ఒక్క ఇమ్మడి రవి వద్ద 50 లక్షల మంది సబ్‌స్క్రైబర్ల డేటా ఉంది, ఈ వ్యవహారం కేవలం రూ.20 కోట్లు కోసం కాదు.. దీని వెనక వేల కోట్లు దోచే భారీ ప్లాన్ ఉంది` అంటూ నాగార్జున హెచ్చరించారు.


