యువత రాజకీయాల్లోకి రావాలి
బండి సంజయ్
సర్దార్@150 యూనిటీ మార్చ్‌లో కేంద్ర మంత్రి
సౌదీ బస్సు ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన బండి
కాకతీయ, కరీంనగర్ : యువత దేశ నిర్మాణంలో రాజకీయాల్లోకి ముందుకు రావాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. వారసత్వ రాజకీయాలు దేశాన్ని వెనక్కి లాగుతున్నాయని, యువత వ్యవస్థలోకి రాకపోతే ఈ ధోరణి మరింత బలపడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయి పటేల్ 150వ జయంతి ఉత్సవాల సందర్భంగా సోమవారం కరీంనగర్‌లోని ఎస్సారార్ కళాశాల నుంచి ప్రారంభమైన ‘సర్దార్@150 యూనిటీ మార్చ్’లో ఆయన పాల్గొన్నారు. వేలాది మంది విద్యార్థులు, యువత నినాదాలతో అతడు ముందుకు సాగగా పాదయాత్రకు విశేష స్పందన లభించింది.ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ, దేశ ఐక్యత కోసం తన జీవితాన్ని అర్పించిన పటేల్ చరిత్రలో మహత్తర నాయకుడని, దేశంలోని 560 సంస్థానాలను భారత త్రివర్ణ పతాకం కింద కలుపడంలో ఆయన పాత్ర అపూర్వమని గుర్తుచేశారు. పటేల్ లేకపోతే తెలంగాణ పరిస్థితి పూర్తిగా మరో దిశలోకి వెళ్లిపోయే ప్రమాదం ఉందని, నిజాం కుట్రలను ఛేదించి ‘ఆపరేషన్ పోలో’ ద్వారా తెలంగాణను భారత్‌లో విలీనం చేయడం పటేల్ దూరదృష్టికి నిదర్శనమన్నారు. ఐఏఎస్, ఐపీఎస్ వంటి ఆధునిక పరిపాలనా వ్యవస్థలకు పటేల్ పునాది వేశారని వివరించారు.దేశ అభివృద్ధి కోసం యువత రాజకీయాల్లో కీలక పాత్ర వహించాలని ఆయన సూచించారు. ఉద్యోగాలు, వ్యాపారాలు, విదేశాల్లో అవకాశాలకే తమ భవిష్యత్తును పరిమితం చేసుకుంటే పాలనా వ్యవస్థలో యువత భాగస్వామ్యం తగ్గిపోతుందని, ఫలితంగా కుటుంబ ఆధారిత రాజకీయాలు పెరిగి దేశానికి నష్టం జరుగుతుందని పేర్కొన్నారు. మరోవైపు డ్రగ్స్, మద్యం, పబ్ కల్చర్ వంటి అలవాట్లలో చిక్కుకుంటున్న యువతను సమాజం కోల్పోకూడదని, దేశం ముందుకు సాగాలంటే యువత ఆలోచన, శక్తి రాజకీయాల్లో వినియోగించాల్సిందేనన్నారు.సౌదీ అరేబియాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 42 మంది భారతీయులు మృతి చెందడం బాధాకరమని, అందులో 18 మంది తెలుగు వారు ఉన్నట్లు తెలిసి తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యానని తెలిపారు. ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సౌదీ అధికారులతో మాట్లాడుతున్నారని, బాధిత కుటుంబాలకు అన్ని విధాలా సాయం అందించనున్నట్టు హామీ ఇచ్చారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.జగిత్యాల జిల్లా బసపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం పట్ల కూడా విచారం వ్యక్తం చేసిన బండి సంజయ్, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అవగాహన, ట్రాఫిక్ నియమాలపై ప్రజల్లో మరింత చైతన్యం రావాల్సిన అవసరం ఉందన్నారు. బాధిత కుటుంబాలకు తగిన సాయం అందేలా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు.



