అభివృద్ధికి ఆమడ దూరంలో కాకతీయల ఆలయం
స్వయంభువుగా వెలసిన శంభులింగేశ్వర లింగం విశేష ఖ్యాతిని పొందింది.
కాకతీయుల ఆరాధ్య దైవం స్వయంభు దేవాలయం
ఓరుగల్లు శంభులింగేశ్వర ఆలయంలో కనీస సౌకర్యాల లేమి
ప్రఖ్యాత దేవాలయం పరిస్థితిపై స్థానికుల ఆవేదన
కాకతీయ, ఖిలావరంగల్ : కాకతీయుల రాజధాని ఓరుగల్లు కోటలో స్వయంగా వెలిసిన స్వయంభు శివలింగానికి కాకతీయ చక్రవర్తి గణపతి దేవుడు దేవాలయాన్ని నిర్మించాడు. కాకతీయ రాజు నిర్మించిన ఈ స్వయంభు దేవాలయం కార్తీకమాసంలో భక్తులతో కిటకిటలాడుతోంది. అయితే, ఆలయ ప్రాముఖ్యత పెరుగుతున్నా… కనీస సౌకర్యాల లేమితో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఆలయానికి మైకు సదుపాయం లేకపోవడం, తాగునీటి ఏర్పాట్లు నిర్లక్ష్యం చెయ్యడం, శుభ్రత సరిగా లేకపోవడం వంటి సమస్యలు రోజు రోజుకూ పెరుగుతున్నాయని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
“వెయ్యేళ్ల చరిత్ర ఉన్న దేవాలయం… కానీ సదుపాయాలు మాత్రం కాలానికి అనుగుణంగా లేవు” అని భక్తులు బాధపడుతున్నారు.
స్థానిక దేవస్థానం కమిటీ, కార్పొరేటర్లు,స్థానిక ఎమ్మెల్యే దేవాదాయశాఖ మంత్రి కొండ సురేక దృష్టికి ఎందుకు తీసుకెళ్లడం లేదని శాఖాధికారుల వైఖరిపై భక్తుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది.
“ఇంత భారీ రద్దీ ఉన్నా… ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇక్కట్లు పడేది మాత్రం భక్తులే” అని వారు ఆరోపిస్తున్నారు.
ఆలయ పరిసరాల్లో రోడ్ సరిగ లేకపోవడం సమస్యలను మరింత పెంచుతున్నాయి.
దీంతో కార్తీక దీపారాధనకు వచ్చే కుటుంబాలు అసౌకర్యాన్ని ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తోంది.
స్థానికులు తక్షణమే మైకు వ్యవస్థ, నీటి సదుపాయం,ఇంకుడు గుంత, శుభ్రత, వెలుతురు వంటి మౌలిక అవసరాలు అందించాలని అధికారులను కోరుతున్నారు.



