హన్మకొండ జిల్లాకు 2.25 కోట్ల చేప పిల్లలు..
మత్స్యకారుల అభ్యున్నతే ప్రభుత్వ ధ్యేయం..
ధర్మసాగర్ రిజర్వాయర్‌లో 12.50 లక్షల చేప పిల్లల విడుదల..
ధర్మసాగర్.. ఘనపూర్ రిజర్వాయర్లలో చేప ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటు..
123 కోట్లతో రాష్ట్రవ్యాప్తంగా ఉచిత చేప పిల్లల పంపిణి..
రిజర్వాయర్ల వద్ద రక్షణ జాలిలు ఏర్పాటు.. చేపల నష్టానికి బ్రేక్ : మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి..
కాకతీయ, వరంగల్ బ్యూరో : హన్మకొండ జిల్లాలో 2 కోట్లు 25 లక్షల చేప పిల్లలను పంపిణీ చేస్తున్నట్లు మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి తెలిపారు. చేప పిల్లలు వదిలిన చెరువుల వద్ద సూచిక బోర్డులు ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. ఆదివారం హనుమకొండ జిల్లా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలోని ధర్మసాగర్ మండల కేంద్రంలో చేప పిల్లల విడుదల కార్యక్రమం ఘనంగా జరిగింది. మత్స్యకారుల కుటుంబాల ఆర్థిక స్థితిలో మార్పు తీసుకురావాలనే లక్ష్యంతో రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పరిశ్రమ అభివృద్ధి, మత్స్య, క్రీడలు & యువజన సర్వీసుల శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి, మాజీ ఉప ముఖ్యమంత్రి, స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరిలు సోమవారం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా పెద్దమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం రిజర్వాయర్‌లో 12 లక్షల 50 వేల చేప పిల్లలను విడుదల చేశారు. సభలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ.. మత్స్యకారుల సమస్యలపై పూర్తి అవగాహన కలిగిన మంత్రి వాకిటి శ్రీహరి ఎదుగుదల అందరికీ ఆదర్శమని చెప్పారు. ధర్మసాగర్ రిజర్వాయర్‌కు నాలుగు వైపులా ఉన్న కాలువల ద్వారా చేపలు బయటకు వెళ్లి మత్స్యకారులు నష్టపోతున్నందున తూములు, కాలువల వద్ద ఐరన్ ఫెన్సింగ్ జాలి ఏర్పాటు చేయాలని కోరారు. చేప పిల్లల పంపిణిని ప్రతీ సంవత్సరం ఆగస్టు చివరికల్లా ప్రారంభించేలా ముందస్తు ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు. మత్స్య సొసైటీ సభ్యత్వం కోసం దరఖాస్తు చేసిన అర్హులందరికీ వెంటనే సభ్యత్వాలు మంజూరు చేయాలని, మరణించిన సభ్యులకు అందాల్సిన పరిహారాన్ని తక్షణం అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

దేవాదుల ప్రాజెక్టు కింద నియోజకవర్గంలో ఏడు రిజర్వాయర్లు ఉండి, సంవత్సరం పొడవునా నీరు ఉండటంతో ధర్మసాగర్, ఘనపూర్ రిజర్వాయర్లలో చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. తదుపరిగా మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ.. మత్స్యకారుల జీవన ప్రమాణాలలో మెరుగుదల తీసుకురావడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. రాష్ట్రంలో 8 మెట్రిక్ టన్నుల చేపల ఉత్పత్తి లక్ష్యంగా ముందుకు సాగుతామని, త్వరలోనే రొయ్యల పెంపకాన్ని కూడా విస్తరించనున్నట్లు ప్రకటించారు. స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో చేప పిల్లల ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు జరుగుతుందని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని చెరువులు, రిజర్వాయర్ల తూములు, కాలువల వద్ద రక్షణ జాలిలు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. మత్స్య సహకార సంఘాల సభ్యులకు ఉచిత ఇన్సూరెన్స్ వర్తింపజేయడం, తొలిసారి రాష్ట్రవ్యాప్తంగా 123 కోట్లతో ఉచిత చేప పిల్లల పంపిణి చేపట్టడం చారిత్రాత్మకమని అన్నారు. చేపల సైజు, కౌంటింగ్ విషయంలో రాజీ ఉండదని, చేపల పంపిణీలో అవకతవకలు లేదా దొంగతనాలు జరిగితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతి ఏడాది 20 శాతం చేపల ఉత్పత్తి పెంచే దిశగా చర్యలు చేపడతానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ సాయి కుమార్, ముదిరాజ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ జ్ఞానేశ్వర్, ఫిషరీస్ కార్పొరేషన్ కమిషనర్ నిఖిల, జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్, మత్స్య శాఖ అధికారులు, ముదిరాజ్, గంగపుత్ర సమాజాల నాయకులు, మత్స్య సహకార సంఘాల సభ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



