పద్మశాలి కార్తీకమాస వనభోజనం…
ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి, మేయర్…
కాకతీయ, వరంగల్ సిటీ : వరంగల్ జిల్లా ఖిలా వరంగల్ చింతల్ గ్రౌండ్ లో ఆదివారం పద్మశాలి కార్తీకమాస వనభోజన మహోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖా మంత్రి కొండా సురేఖ, నగర మేయర్ గుండు సుధారాణి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి సురేఖ కు వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. కార్యక్రమ నిర్వాహకులు, ప్రజలు మంత్రిని సాదరంగా ఆహ్వానించారు. ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం మంత్రి సురేఖ ను నిర్వాహకులు శాలువాతో సన్మానించి, జ్ఞాపికను అందించారు. ఈ సందర్భంగా మంత్రి సురేఖ మాట్లాడుతూ పూర్వీకులు మన ప్రయోజనాలను కోరి అనేక ఆచారాలను, సంప్రదాయాలను ఏర్పరిచారని, సామూహిక జీవన విధానాన్ని అలవాటు చేసే వన భోజన కార్యక్రమం అలాంటిదేనని అన్నారు. వన భోజనాలకు వచ్చిన వారికి పేరుపేరునా మంత్రి సురేఖ శుభాకాంక్షలు తెలిపారు. ఆ రోజుల్లో ప్రజలు ఆధ్యాత్మిక, సామాజిక ప్రయోజనాలను ఆశించి వన భోజనాలు జరుపుకునేవారని అన్నారు. కానీ కాల క్రమంలో కులాల వారీగా వన భోజనాలు జరుపుకునే ఆచారం వచ్చిందని తెలిపారు. ఒకరి కోసం అందరూ, అందరి కోసం ఒకరూ సహకరించుకుంటూ పోతే ప్రజల మధ్య సహృద్భావ సంబంధాలు పెంపొంది వసుదైక కుటుంబంగా వర్ధిల్లుతాతమనీ, సత్సంబంధాలు పెరిగి ఉన్నతంగా ఎదగడానికి తోడ్పడుతుందని మంత్రి సురేఖ తెలిపారు. వన భోజనాలతో ప్రజల మధ్య సాన్నిహిత్యం పెరిగి, వైవాహిక సంబంధాలతో కుటుంబ బంధాలు మరింత బలపడతాయని మంత్రి అన్నారు. వన భోజనాల తర్వాత కార్తీక దీపోత్సవాన్ని నిర్వహించుకోవడం అభినందనీయమని మంత్రి సురేఖ పేర్కొన్నారు. తనను ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన నిర్వాహకులకు ధన్యవాదాలు తెలిపారు.


