అర్చకుల సూచనలు తీసుకుంటూ జాతర ఏర్పాట్లు..మంత్రి సీతక్క
కాకతీయ, ములుగు ప్రతినిధి: శ్రీ మేడారం సమ్మక్క–సారలమ్మ మహా జాతరకు భక్తుల రాక పెరుగుతున్న నేపథ్యంలో, అమ్మవార్ల గద్దెల పవిత్రత దెబ్బతినకుండా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయని మంత్రి సీతక్క అర్చకులకు హామీ ఇచ్చారు. రాబోయే జనవరి 28 నుండి 31 తేదీల్లో జరిగే జాతర కోసం జరుగుతున్న ఏర్పాట్లను ఆదివారం మంత్రి ప్రత్యేకంగా పరిశీలించారు. దేవాలయ ప్రాంతంలో జరుగుతున్న రహదారి, పారిశుద్ధ్యం, కట్టడాలు, నీటి సదుపాయాల పనులను పరిశీలించిన మంత్రి, పూజారుల సంఘం అధ్యక్షుడు జగ్గారావు, అర్చకులు వీరస్వామితో సమావేశమై వారి సూచనలు వినిపించారు. గద్దెల వద్ద భక్తుల రద్దీ పెరిగిన సమయంలో పవిత్రత, శుభ్రత, భక్తి వాతావరణం కాపాడటం అత్యంత ముఖ్యం అని అర్చకులు పేర్కొనగా, అర్చకుల అభిప్రాయాలే జాతర నిర్వహణలో కీలకం అని మంత్రి సీతక్క తెలిపారు. అమ్మవార్ల గద్దెల ప్రాంగణం ఏ విధంగానూ దెబ్బతినకుండా పునరుద్ధరణ పనులు చేస్తున్నాం అని,పూజా కార్యక్రమాలకు ఆటంకం లేకుండా అన్ని ఏర్పాట్లు జరుగుతాయి అని, అర్చకుల సూచనల మేరకు కొన్ని మార్పులు కూడా చేపట్టాలని సంబంధిత అధికారులకు ఆదేశించాం అని మంత్రి సీతక్క చెప్పారు.

కలెక్టర్ దివాకర, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవి చందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణిలతో కలిసి మంత్రి పలు కీలక ప్రాంతాలను సందర్శించారు. భక్తుల సౌకర్యం కోసం ప్రత్యేక నీటి ట్యాంకులు, శుచీకరణ కేంద్రాలు, పార్కింగ్ ఏరియాలు, రవాణా సదుపాయాలు వేగంగా సిద్ధమవుతున్నాయి. అంతకుముందు అమ్మవార్ల దర్శనం చేసిన మంత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమ్మవార్ల సేవలో భక్తుడిలా ముందుండి మార్గనిర్దేశం చేస్తున్నారు అని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాతర నిర్వహణే ప్రభుత్వ లక్ష్యం అని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్, ట్రైబల్ వెల్ఫేర్, ఇరిగేషన్ శాఖల అధికారులు, అర్చకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.



