ఐ బొమ్మ క్లోజ్
బప్పం టీవీ వెబ్సైట్లూ మూసివేత
సినీ ప్రముఖులను బెదిరించిన రవి !
చెంచల్‌గూడ జైలులో నిందితుడు
బ్యాంక్ అకౌంట్ వివరాలపై పోలీసుల ఆరా..
నేడు నాంపల్లి కోర్టులో కస్టడీ పిటిషన్
కాకతీయ, తెలంగాణ బ్యూరో : పైరసీ సినిమాలకు వేదికగా మారిన ఐబొమ్మ, బప్పం టీవీ వెబ్సైట్లను సైబర్ క్రైమ్ పోలీసులు క్లోజ్ చేయించారు. శనివారం అరెస్టయిన ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవితోనే వాటిని మూసివేయించి, వెబ్ లాగిన్స్, సర్వర్ వివరాలతో తొలగించారు. ‘నా వద్ద కోట్ల మంది డేటా ఉంది. ఈ వెబ్సైట్ మీద ఫోకస్ చేయటం ఆపండి’ అంటూ గతంలో అతడు పోలీసులకు సవాల్ విసిరినట్లు సామాజిక మాధ్యమాల్లో ఓ లేఖ చక్కర్లు కొట్టింది. దీంతో ఆ సవాల్‌ను స్వీకరించిన పోలీసులు ముందుగా ఐబొమ్మలోని కొందరిని అరెస్టు చేశారు. ఈక్రమంలో విదేశాల నుంచి వచ్చిన ఇమ్మడి రవితోనే పోలీసులు ఆయా వైబ్సైట్లను క్లోజ్ చేయించడం గమనార్హం. ఇమ్మడి రవి వద్ద స్వాధీనం చేసుకున్న వందల హార్డ్ డిస్క్‌లను పోలీసులు విశ్లేషణ చేస్తున్నారు. నిందితుడి బ్యాంక్ ఖాతాల వివరాలను పరిశీలిస్తున్నారు. అతడిని కస్టడీలోకి తీసుకుని మరికొన్ని వివరాలు సేకరించాలని భావిస్తున్నారు. సోమవారం నాంపల్లి కోర్టులో కస్టడీ పిటిషన్‌ను పోలీసులు దాఖలు చేయనున్నారు.
అసలేం జరిగింది..?
కొత్త సినిమాలు, ఓటీటీ వేదికల్లోని కంటెంట్‌ను పైరసీ చేస్తూ సినీ పరిశ్రమకు పైరసీ తీవ్ర నష్టాన్ని కలిగిస్తోంది. ఈ క్రమంలో ఈ ఏడాది విడుదలైన పలు తెలుగు సినిమాలు పైరసీ బారిన పడటంతో తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ విభాగంలోని యాంటీ వీడియో పైరసీ సెల్ ఆగస్టు 30వ తేదీన నగర సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఐబొమ్మ లాంటి 65 మిర్రర్ వెబ్సైట్లు వేదికగా పలు సినిమాలు పైరసీ జరుగుతున్నట్లు పేర్కొన్నారు. అప్పుడు ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వీరిని సెప్టెంబరు 29న అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అప్పటి నుంచి ఐబొమ్మ సూత్రధారి కోసం పోలీసులు వేట ప్రారంభించారు. సెప్టెంబరు 30వ తేదీ వరకు కూకట్‌పల్లిలోని తన నివాసంలోనే ఉన్న రవి, అక్టోబరు 1వ తేదీన ఇక్కడి నుంచి మాయమయ్యాడు. అతడి కదలికలపై నిఘా పెట్టిన పోలీసులు కీలక సమాచారాన్ని సేకరించారు. అక్టోబరు 3న నెదర్లాండ్స్‌లోని ఆమ్‌స్టర్‌డామ్‌లో రవి పాగా వేసినట్లు అంచనాకు వచ్చారు. పోలీసులకు పట్టుబడకుండా ఫ్రాన్స్, కరేబియన్ దీవులు, నెదర్లాండ్స్ తదితర ప్రాంతాల్లో ఉన్నట్లు ఐపీ అడ్రస్‌లతో ఏ మార్చుతూ ఇప్పటివరకూ వచ్చాడు. తనను పోలీసులు పసిగట్టలేరనే ధీమాతో ఆమ్స్టర్డామ్ నుంచి కూకట్‌పల్లికి చేరాడు. అతడి కదలికలను గమనిస్తూ వచ్చిన పోలీసులు ఎట్టకేలకు అతడిని అరెస్ట్ చేశారు.


