ఆడబిడ్డల చదువు ఆపొద్దు
ఫీజురీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలి
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత
తెలంగాణ రాష్ట్రం – విద్యావ్యవస్థ రౌండ్ టేబుల్ సమావేశం
తెలంగాణ జాగృతి టీచర్స్ ఫెడరేషన్ అధ్వర్యంలో నిర్వహణ
కాకతీయ, తెలంగాణ బ్యూరో : బీఆర్ఎస్ పదేళ్లలో విద్యా వ్యవస్థ బాగాలేదని కాంగ్రెస్ ఆరోపించింది. విద్యా వ్యవస్థలో మార్పులు చేస్తామంటూ అధికారంలోకి వచ్చింది. కానీ రెండేళ్లైనా సరే ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకున్నట్లు లేదు. విద్యా కమిషన్ వేశారు. అది మంచి నిర్ణయమే. కానీ విద్యా కమిషన్ ఏం చేస్తోంది. ఆదివాసీలు, మహిళల విద్యా పట్ల వివక్ష కొనసాగుతోంది. ప్రజాక్షేత్రంలో తిరుగుతుంటే ఈ సమస్య మనకు స్పష్టం గా తెలుస్తోంది… అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్ మెంట్ ఇవ్వకపోతే ఆడపిల్లల చదువు ఆపేస్తున్నారు. మగ పిల్లల చదవుకోసం అప్పులు చేసైనా ప్రైవేట్ స్కూళ్లకు పంపుతున్నారు. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్న సరే అది ఆడపిల్లల చదువుకు లింక్ అయి ఉంటుందన్నారు. అందుకు నిజామాబాద్ లో జరిగిన సంఘటన ఉదాహరణ అన్నారు. తెలంగాణ జాగృతి టీచర్స్ ఫెడరేషన్ అధ్వర్యంలో బంజారహిల్స్‌లో తెలంగాణ రాష్ట్రం – విద్యావ్యవస్థ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. విద్యావేత్తలు, ప్రొఫెసర్లు, అధ్యాపకులు, విద్యార్థి నేతలు, మేధావులు హాజరయ్యారు.
టీచర్లు అప్ డేట్ కావాలి: పరంజ్యోతి, విద్యావేత్త
తెలంగాణ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో రీ బర్త్ ఉండాలి. అంగన్ వాడీ నుంచి యూనివర్సిటీ వరకు విద్యా వ్యవస్థను నాశనం చేశారు. ఇప్పటికీ కూడా 19 వేల మంది టీచర్లను భర్తీ చేయాల్సి ఉంది. విదేశాలతో పోల్చుకుంటే మన పరిస్థితి హృదయం ధ్రవించే విధంగా ఉంది. పాలసీ తయారు చేస్తున్న వాళ్లకు తరగతి గది లో ఎక్స్ పీరియన్స్ ఉండాలి. అంగన్ వాడీ నుంచి యూనివర్సిటీ వరకు పూర్తిగా మార్పులు రావాలి. ఫైనాన్షియల్ మేనేజ్ మెంట్, న్యూట్రిషన్ మేనేజ్ మెంట్ పిల్లలకు తెలియాలి. సబ్జెక్ట్ లు పెరగాల్సి ఉంది. టీచర్లు కూడా అప్ డేట్ గా ఉండాలి. టీచర్లు తమ సమయంలో 40 శాతం కూడా టీచింగ్ కు కేటాయించలేని పరిస్థితి. వారిని వేరే యాప్ లు నింపాలంటూ టీచర్ల టైమ్ వేస్ట్ చేస్తున్నారు. టీచర్ల భర్తీ, యూనివర్సిటీల్లో రిక్రూట్ మెంట్ ఉండాలి. రీసెర్చ్ లు, ఇన్నోవేషన్ విషయంలో మనం చాలా వెనుకబడి ఉన్నాం. ఇవన్నీ కూడా మనల్ని చాలా బాధపెట్టే విషయాలు.
విద్య కూడా రాజకీయమైంది: వెంకట్ రెడ్డి , విద్యావేత్త
మన విద్యా వ్యవస్థ లో చాలా మార్పులు రావాల్సి ఉంది. ఇప్పుడు 60 శాతం మంది విద్యార్థులు ప్రైవేట్ కు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. టీచర్ల భర్తీని మొత్తం రాష్ట్రంలో ఉన్న విద్యార్థుల సంఖ్యకు రేషియోతో పోల్చాలి. పిల్లల విద్యా అంతా కూడా ఇప్పుడు రాజకీయమే అయ్యింది. తెలంగాణలో విద్యా వ్యవస్థ సంక్షోభం, ఎమర్జెన్సీలో ఉంది. ఇప్పుడు జాగృతి వద్దకు సమస్య వచ్చిందంటే తల్లి వద్దకు వచ్చిందని నేను భావిస్తున్నా. ప్రభుత్వ విద్య మీద మనం విశ్వాసం కల్పించకపోవటంతోనే ప్రైవేట్ కు వెళ్తున్నారు.
37 లక్షల మంది విద్యార్థులు ప్రైవేట్ కు వెళ్తున్నారు. ఏడాదికి 50 వేల కోట్ల వరకు విద్యార్థుల తల్లితండ్రుల నుంచి ప్రైవేట్ కు వెళ్తున్నాయి. స్కూల్ లో ఉన్న పిల్లలకు టీచర్లను లెక్కించటం సరికాదు. గ్రామంలో ఉన్న పిల్లలకు టీచర్లను లెక్కించాలి. అదే విధంగా పిల్లలను, పిల్లల తల్లితండ్రులను టీచర్లను గౌరవించాలి. ప్రభుత్వ పాఠశాలను పటిష్టపరచటంలో ఫెయిలయ్యాం. అమెరికా, యూరోప్ లాంటి దేశాల్లో నెబర్ ఉడ్ స్కూల్ అనే విధానం ఉంది. తెలంగాణ జాగృతి టీచర్స్ ఫెడరేషన్ ఈ అంశాల మీద పోరాడుతుందని భావిస్తున్నా.


