కన్నతండ్రే కాలయముడయ్యాడు
అంగవైకల్యంతో ఉన్న ఇద్దరు పిల్లలను కడతేర్చాలని చూసిన తండ్రి
కూతురు మృతి, కూమారుడు ఐసీయూలో
కాకతీయ, కరీంనగర్ బ్యూరో : అంగవైకల్యంతో బాధపడుతున్న ఇద్దరు పిల్లలను కన్న తండ్రే కడతేర్చాలనుకున్న దారుణ ఘటన కరీంనగర్లోని వావిలాలపల్లిలో వెలుగు చూసింది. తండ్రి క్రూరకాండతో కూతురు ప్రాణాలు కోల్పోగా కొడుకు ఐసీయూలో ప్రాణాలతో పోరాడుతున్నాడు. కరీంనగర్ 3 టౌన్ పోలీస్ స్టేషన్ సీఐ గడ్డం జాన్ రెడ్డి తెలిపిన వివరాలు ప్రకారం.. వావిలాలపల్లిలో నివాసం ఉంటున్న అనవేణి పోశమ్మ ఆమె భర్త మల్లేశం ఏడేళ్ల క్రితం మంచిర్యాల నుంచి కరీంనగర్ వావిలాల పల్లికి వచ్చి దినసరి కూలీలుగా పని చేసుకుంటున్నారు. వీరికి ఆశ్రిత్ (17), అర్చన (12) ఇద్దరు పిల్లలు పుట్టినప్పటి నుంచే అంగవైకల్యంతో బాధపడుతున్నారు. కాగా శనివారం భార్య పోశమ్మ ఇద్దరు పిల్లలను చూసుకోవాలని భర్త మల్లేషానికి అప్పజెప్పి మార్కెట్ కు వెళ్లింది. సాయంత్రం వచ్చి చూడగా ముందుగదిలో కూతురు అర్చన సృహ తప్పి పడిపోయి ఉంది. వెనుకగదిలో కుమారుడు ఆశ్రిత్ కిందపడి కొట్టుకుంటూ కనిపించాడు. ఇది చూసిన ఆమె వెంటనే పిల్లలను కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించింది. అప్పటికే అర్చన మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఆశ్రిత్‌ను ఐసీయూలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. పిల్లల అంగవైకల్యం, కుటుంబ ఒత్తిడి భరించలేక మల్లేశం గొంతు నులిమి లేదా ఏదైనా మందు తాగించి ఉండొచ్చని కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై పోశమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు సీఐ తెలిపారు. కాగా నిందితుడు మల్లేషం పరారీలో ఉండగా అతడి కోసం గాలిస్తున్నట్లు 3 టౌన్ సీఐ తెలిపారు.



